Video: ప్రైవేట్ ఆస్పత్రి అమానుషం-కోవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేశారు..
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలం నాగారంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఓ కోవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేసింది. ఆస్పత్రికి చెల్లించాల్సిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని మృతుడి కుటుంబ సభ్యులు చెల్లించలేకపోవడంతో ఈ అమానుషానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే... తుర్కపల్లి మండలానికి చెందిన బోయిని వెంకటేశ్ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. మూడు రోజుల క్రితం వెంకటేశ్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు అతన్ని నాగారంలోని శ్రీ ధరణి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం(మే 21) సాయంత్రం వెంకటేశ్ మృతి చెందాడు. ఆస్పత్రికి చెల్లించాల్సిన బిల్లులో రూ.20వేలు కుటుంబ సభ్యులు చెల్లించలేకపోయారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం మృతుడు వెంకటేశ్ మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేసింది. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంతో గొడవకు దిగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

మరోవైపు ఆస్పత్రి యాజమాన్యం వాదన మరోలా ఉంది. వెంకటేశ్ అనే కోవిడ్ పేషెంట్ శుక్రవారం సాయంత్రం 5గం.-6గం. మధ్యలో డిశ్చార్జి అయినట్లు అక్కడి సిబ్బంది వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి వెళ్లేందుకు డిశ్చార్జి అయినట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే పేషెంట్ చనిపోయాడని... దీంతో ఆ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకొని ఆస్పత్రి వద్దకు వచ్చారని చెప్పారు. మృతదేహాన్ని ఆస్పత్రి ఎదుట పడేసి యాజమాన్యంతో గొడవకు దిగినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేసినట్లు తెలిపారు.

కరోనా వేళ ఇలాంటి అమానుష ఘటనలు చాలానే వెలుగుచూస్తున్నాయి. పేద,మధ్య తరగతి వర్గాలు కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీ,అమానుష వైఖరికి బలైపోతున్నారు. ఇటీవల కొన్ని కార్పోరేట్ ఆస్పత్రులు కేవలం క్యాష్ పేమెంట్ మాత్రమే తీసుకుంటామని షరతులు విధిస్తున్నాయి. దీంతో డబ్బు కోసం ఏటీఎంల చుట్టూ తిరుగుతుండగానే రోగుల ప్రాణాలు పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నెల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

కొన్నిచోట్ల కన్నబిడ్డలు సైతం కరోనాతో చనిపోయిన తల్లిదండ్రుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రావట్లేదు.దీంతో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు అనాథ శవాల్లా మారుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా కరోనా దేశంలో అత్యంత అమానవీయ పరిస్థితులను సృష్టిస్తోంది.
Video: ప్రైవేట్ ఆస్పత్రి అమానుషం-కోవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేశారు.. #Telangana #Hyderabad #coronavirus #covid19 #medchal #malkajgiri pic.twitter.com/AAUObsNiyP
— oneindiatelugu (@oneindiatelugu) May 22, 2021