వైద్యారోగ్యశాఖ రెడీ: సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్: మంత్రి హరీశ్ రావు
వర్షాలతో సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. దీంతో వైద్యారోగ్య శాఖ పూర్తి సన్నద్దంగా ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హెల్త్ డిపార్ట్ మెంట్ రెడీగా ఉందని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. ఆయా ఆసుపత్రుల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఎలాంటి కేసులు వచ్చినా అడ్మిట్ చేసుకొని వైద్యం అందించాలని స్పష్టం చేశారు. సోమవారం అన్ని జిల్లాల వైద్యాధికారులు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు, వైద్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సీజనల్ వ్యాధులు..
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, డయేరియా తదితర రోగాల పట్ల అవగాహన పెంచాలని కోరారు. రోగ నిర్దారణ పరీక్షలు వెంటనే నిర్వహిస్తూ అవసరం అయిన వారికి చికిత్స అందించాలన్నారు. సబ్ సెంటర్ స్థాయి నుంచి జిల్లా ఆసుపత్రి వరకు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
108 వాహనాలు వెళ్ళలేని ప్రాంతాలను ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాగులు పొంగటం, రోడ్లు చెడి పోవడం వల్ల కొన్ని గిరిజన ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ పోయే అవకాశం ఉంటుందన్నారు. రోగులతోపాటు గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. బర్త్ వెయిటింగ్ రూములను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్వహించారు.

వెల్‌డన్
రోగులకు త్వరిత గతిన సేవలు అందించాలని చెప్పారు. మంచి పనితీరు నమోదు చేసిన ఎంజీఎం, నిజామాబాద్, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రులను అభినందించారు. జిల్లా స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కేసులను హైదరాబాద్‌కు రిఫర్ చేయవద్దన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం గణనీయంగా పెంచింది. 720 గా ఉన్న జాబితాను 843కు పెంచింది. దీంతో కొత్తగా 123 రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి.

వారానికోసారి సమీక్ష
అత్యవసర సేవలు అన్ని వేళలా అందించేందుకు వీలుగా అనస్తీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాల్సిందేనని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. వారానికి ఒక విభాగం వారీగా సూపరింటెండెంట్లు సమీక్ష నిర్వహించాలని కోరారు. పురోగతి మెరుగుపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications