యువతి తగాదా, మాట్లాడుకుందాం.. రా..! కారులో నగర యువకుడికి నరకయాతన..!
జూబ్లీహిల్స్ : యువతి విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడికి నరకయాతన మిగిల్చింది. కారులో నగరమంతా తిప్పుతూ చిత్రహింసలకు గురిచేశారు కొందరు. బంజారాహిల్స్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మహ్మద్ మన్సూర్ అలీఖాన్ చదువుకుంటున్నాడు. అయితే ఓ యువతి విషయంలో మాట్లాడాలంటూ ఫలానా దగ్గరకు రావాలని అతడికి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అక్కడకు వెళ్లిన మన్సూర్ కు చేదు అనుభవం ఎదురైంది.
ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తి మన్సూర్ తో మాట్లాడుతుండగా.. కొందరు కారులో వచ్చి అతడిని బలవంతంగా ఎక్కించుకున్నారు. అలా నగరమంతా తిప్పుతూ కారులోనే మన్సూరును చిత్రహింసలకు గురిచేశారు. ఇష్టమొచ్చినట్లుగా చితకబాదడంతో మన్సూర్ ముక్కు నుంచి రక్తస్రావం జరిగింది. అలా కారులో చిత్రహింసలు పెడుతూనే ఓ హెయిర్ సెలూన్ కు తీసుకెళ్లి గుండు కొట్టించారు. అంతేకాదు అతడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్ తో పాటు 5వేల రూపాయల నగదు లాక్కున్నారు.

కారులో అతడ్ని ఎక్కించుకున్న దగ్గర్నుంచి గుండు తీయించే వరకు మొత్తం తతంగం వీడియో తీసిన సదరు యువకులు.. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ మన్సూర్ ను బెదిరించారట. చివరకు అతడిని ఆరాంఘార్ క్రాస్ రోడ్డు దగ్గర పడేసి వెళ్లిపోయారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి విషయం వివరించడంతో ఇబ్రహీంఖాన్ తో పాటు అతడికి సహకరించినవారిపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications