ఎంజీబీఎస్-ఫలక్ నుమా మెట్రో మార్గం కసరత్తులు షురూ: 5 స్టేషన్లు, భూసేకరణకు సిద్ధం
హైదరాబాద్: పాతబస్తీకి మెట్రో రైలు పనులపై కసరత్తులు మొదలయ్యాయి. నెల రోజుల్లో భూసేకరణ నోటీసులు జారీ చేస్తామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు రైలు నడిపేందుకు గతంలో ప్రతిపాదన వచ్చిన విషయం తెలిసిందే. అయితే, భూసేకరణలో సమస్యలు తలెత్తడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. పాతబస్తీకి మెట్రో రైలు మార్గం పూర్తి చేయాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించారంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) ప్రయత్నాలు ప్రారంభించింది.
పాతబస్తీలో మెట్రో రైలు మార్గంలో ఐదు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి దారుల్ ఫా జంక్షన్-పురాణీ హవేలీ-ఇత్తెబార్ చౌక్-అలీజాకోట్ల-మీర్ మోమిన్ దైరా-హరిబౌలి-శాలిబండ-శంషీర్‌గంజ్, ఆలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు ఉంటుంది. ఈ మెట్రో రైలు మార్గంలో సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్ గంజ్, ఫలక్‌నుమా ష్టేషన్లు ఉండనున్నాయి. ఈ మార్గంలో 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని, వాటిలో 4 నిర్మాణాల విషయంలో సమస్యలు తలెత్తాయని చెప్పారు. త్వరలోనే వాటిని కూడా పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.

ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గం నిమిత్తం 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు స్పష్టం చేసినట్లు కేటీఆర్ ఇటీవల వెల్లడించారు. మెట్రో రైలు తొలి విడత కింద 69.2 కిలోమీటర్లు నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని నిర్మించే విషయంలో చేతులెత్తేసింది. రాయదుర్గంతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించడంతోపాటు, నిలిచిపోయిన ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తర్ణం 74.7 కిలోమీటర్లకు విస్తరించనుంది.
దాదాపు ఆరేళ్లుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడంతో అప్పట్లో మజ్లిస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మార్గాన్ని మళ్లించేందుకు(ఎలైన్మెంట్) సర్వే నిర్వహించినా ముందడుడు పడలేదు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులతో, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియణ్‌తో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మిగిలిన 5.5 కిలోమీటర్ల మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications