కొడాలి నానికి ఇక్కడ రెండు ఇళ్లు ఉన్నాయి.. ఆలోచించి మాట్లాడాలి: శ్రీనివాస్ గౌడ్
తెలుగు రాష్ట్రాల్లో జల జగడం సెగలు రేపుతోంది. మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఏపీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేయగా.. దానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి నానికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆయన ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా.. అని ప్రశ్నించారు.

రామచంద్రయ్య కూడా..
సి.రామచంద్రయ్య కూడా వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఇక్కడ తింటూ అక్కడి మాట మాట్లాడితే ఇక్కడి ప్రజలు మీ గురించి ఆలోచన చేస్తే పరిస్థితి ఏంటి? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తమ పదవులు పోయినా, ప్రాణాలు పోయినా ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టును అడ్డుకుంటాం అని శ్రీనివాస్ గౌడ్ స్పష్టంచేశారు.

పచ్చబడుతోన్న పాలమూరు
పాలమూరు ఇప్పుడిప్పుడే పచ్చబడుతుందని ఆయన తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశతో ఉన్నారని చెప్పారు. ఆ ఆశలకు పక్క రాష్ట్రం గండికొడుతోందన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తికావాలని ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారని.. జగన్ ప్రభుత్వం వరద జలాల పేరుతో నికర జలాలను తరలిస్తోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పారు. కృష్ణా రివర్ బోర్డ్ రాయలసీమ ప్రాజెక్టును ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని మాకు ఎలా ఆదేశాలు ఇస్తారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

రక్షకుడు అని కామెంట్స్..
ఇటు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాక్షసుడు కాదని, రక్షకుడని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిన్న కామెంట్స్ చేశారు. ఆయన బ్రతికి ఉంటే రాష్ట్రం ఇలా ఉండేదికాదని, రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడినవారు రాజశేఖరరెడ్డి అని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి వుంటాయని కొడాలి నాని తెలిపారు. ఆ రాష్ట్ర ప్రయోజనాలు వారు చూసుకోవాలని హితవు పలికారు.

రాక్షసుడు అని ఫైర్
అంతకుముందు తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు అనుకున్నామని చెప్పారు. తప్పు దిద్దుకుంటారని చర్చలు జరిపామని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలని సజెస్ట్ చేశారు. కానీ అలా జరగడం లేదని చెప్పారు. తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్‌ఆర్‌ను దొంగ అనక ఏమంటారు? ఇప్పుడు జగన్ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారు అని శ్రీనివాస్ గౌడ్ ఫైరయ్యారు. నీటి గొడవ, ఇతర అంశాలపై సయోధ్యతో ఉందామనుకుంటే.. నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత ఆయనది అని విరుచుకుపడ్డారు. దానికి సంబంధించి మంత్రుల మధ్య కౌంటర్ అటాక్ కంటిన్యూ అవుతుంది.












Click it and Unblock the Notifications