నగరంలో తగ్గిన లాక్ డౌన్ సీరియస్ నెస్..!యధేచ్చగా రోడ్లమీదకు..!ఏమాత్రం తగ్గని కేసులు..!
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సాధారణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలతో గత 42రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభత్వం ఇచ్చిన మినహాయింపుల వల్ల సాధారణ జన జీవన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినిమా హాల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, రవాణా వ్యవస్థలపై ఆంక్షలు అమలులో ఉన్నప్పటికి జనాలు విచ్చలవిడిగా రోడ్లపై కనిపిస్తున్నారు. ముఖ్యంగా మద్యం షాపులు తెరుచుకోవడంతో లాక్ డౌన్ సీరియస్ నెస్ మరుగునపడిపోయినట్టు తెలుస్తోంది. ప్రతిపోలీసు స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారుల మీద చెక్ పోస్టులు పెట్టి జనాన్ని కట్టడి చేసిన పోలీసులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో హైదరాబాద్ నగరంలో సాధారణ పరిస్ధితులు నెలకొన్నట్టు తెలుస్తోంది.
Recommended Video

నగర రోడ్లపై వేల వాహనాలు.. హైదరాబాద్ లో కనిపిస్తున్న సాధారణ పరిస్తితులు..
ఇంతవరకూ బాగానే ఉన్నా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. స్వీయ నియంత్రణ, లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్న తరుణంలోనే కేసులు విజృంభిస్తే, ఆంక్షలు సడలించిన తరుణంలో ఇంకెంత వరకు కేసులు పెరుగుతాయోనని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలోని కరోనా ప్రభావిత ప్రాంతాలు, కరోనా ప్రభావం లేని ప్రాంతాలని విభజించి సడలింపులు ప్రకటించడంతో సమస్య మొదటికొచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కూడా జిల్లాలను జోన్లుగా విభజించి కొన్ని వెసులబాటులను కల్పించింది తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం.

ప్రజల్లో లాక్ డౌన్ సీరియస్ నెస్ పోయింది.. మినహాయింపులే కారణమంటున్న జనాలు..
అయితే స్వీయ నియంత్రణ పాటిస్తూనే ప్రభుత్వం కల్పించిన వెసులుబాటులను ఉపయోగించుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఉత్తర్వును కూడా తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. మాస్క్ లేకుండా బయటకు రావడాన్ని పూర్తిగా నిషేదించిన సర్కార్, సమూహాలుగా ఏర్పడవద్దని కూడా ఉత్తర్వులో పొందుపరిచింది. కాని ఈ ఆదేశాలను ప్రజలు ఎక్కడా అంత సీరియస్ గా పాటిస్తున్నట్టు కనిపించడం లేదు. అంతా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ కరోనా వైరస్ ఏమీ చేయలేదని ధీమాగా నగర ప్రజలు రోడ్ల పై సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. మే 5న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించిన మినహాయింపులతో కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయభ్రాంతులకు బదులు ఉపశమనం లభించినట్టు భావించారు.

స్వీయ నియంత్రణ తగ్గింది... కేసుల సంఖ్య మాత్రం పెరుగుతున్నాయి..
అందుకే మద్యం కొనుగోలు చేయాలనే నెపంతో వైన్ షాపుల ముందు విచ్చలవిడిగా వ్యవహరించారు మద్యం ప్రియులు. మరోపక్క రానున్న రోజుల్లో కరోనా మహమ్మారి మరింతి పంజా విసరబోతుందని ఎయిమ్స్ వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దానికి తోడు లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తే కరోనా వైరస్ విలయ తాండవం చేయనున్నట్టు, దానికి ఎవరు బాద్యత వహిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడ గత వారం ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్ భారతో లో మాత్రం అంత ప్రమాదకరంగా విరుచుకుపడలేదని చెప్పాలి. ప్రపంచ దేశాలు కూడా ఇదే అంశాన్ని నిర్ధారించాయి.

మినహాయింపులెందుకు.. లాక్ డౌన్ కొనసాగించాలంటున్న మరోవర్గం..
భారత దేశంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉండడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు దేశ ప్రధాని నరేంద్ర దమోదర్ దాస్ మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. కాగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి మినహాయింపులు ఇవ్వడంతో కొన్ని సమస్యలు తలెత్తాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. యూనిఫాంగా దేశం మొత్తం లాక్ డౌన్ ఆంక్షల్లో ఉంటే కరోనా మహమ్మారిని వేగంగా తరిమికొట్టొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి దేశాన్ని కరోనా ప్రభావిత, కరోనా రహిత జోన్లుగా విభజించి వెసులబాటు కల్పించడం అంత ఉపయుక్తంగా లేదని, దాని వల్ల కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications