జీవో 111 అవసరం లేదు.. ఎత్తివేస్తాం: అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. వివాదాస్పదంగా మారిన 111 జీవో గురించి సభలో మాట్లాడారు. దీనికి సంబంధించి నిపుణుల కమిటీ నివేదిక తమకు అందగానే.. ఈ జీవోను ఎత్తేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ జీవోనే అర్థరహితమని తేల్చి చెప్పారు. గతంలో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిరక్షణ కోసం ఈ జీవోను తీసుకువచ్చారని గుర్తు చేశారు.

జలాశయాలు అవసరం లేదు..
హైదరాబాద్ కు ఈ జలాశయాలు ఇప్పుడు అవసరం లేదన్నారు. తెలంగాణ రాజధానికి కృష్ణా, గోదావరి జలాలను తరలిస్తున్నామని.. ఇంకో వందేళ్ల వరకూ హైదరాబాద్‌కు నీటి కొరత ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ఇప్పటికే పని చేస్తున్నారని.. ఉన్న ఫళంగా ఎత్తేస్తే జీవో పరిధిలో ఉన్న లక్షా 32 వేల 600 ఎకరాల భూముల పరిస్థితిలో కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని శాసనసభలో వెల్లడించారు.

జీవో తీసుకొచ్చి..
హైదరాబాద్ కు కొన్ని దశాబ్దాల నుంచి తాగునీటికి ప్రధాన వనరుగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కాలుష్యం నుంచి కాపాడేందుకు.. 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను అమలు చేసింది. ఆ 2 రిజర్వాయర్ల పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టకుండా.. భవనాన్ని జీ +2కి మించకుండా మాత్రమే నిర్మించుకోవాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.

నిర్మాణాలు.. వివాదాస్పదం
ఆ రెండు రిజర్వాయర్ల పరిధిలోని చాలా ప్రాంతాలు.. ఈ జీవో పరిధిలోకి వస్తాయి. ఈ ఉత్తర్వులతో 1996 నుంచి జంట జలాశాయల పరిధిలో చాలా నిర్మాణాలు వివాదాస్పదం అయ్యాయి. దానిపై ఇప్పుడు కేసీఆర్.. అసెంబ్లీలో చేసిన ప్రకటన సంచలనంగా మారింది. హైదరాబాద్ తాగునీరు సమస్య ఎలా అనే ప్రశ్నవస్తోంది. ఇప్పటివరకు అయితే గోదావరి, కృష్ణా అంటున్నారు.. మరీ కరువు, కాటకాలు వస్తే ఏంటీ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంతేకాదు జంట జలాశయాలు ఉండటంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉబికి వస్తోంటాయి. మరీ జీవో తీసుకొచ్చి.. ఎడారి వస్తే పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది.












Click it and Unblock the Notifications