'గుడి కూలితే.. వామన్‌రావు కూలిపోతాడు...' న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన ఆడియో క్లిప్...
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో పట్టపగలే న్యాయవాద దంపతులను అత్యంత పాశవికంగా దుండగులు హత్య చేసిన ఘటనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. గుంజపడుగు గ్రామంలో నిర్మించిన గుడి వివాదమే హత్యకు ప్రధాన కారణమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న కుంట శ్రీనుకు,న్యాయవాది వామన్‌రావుకు మధ్య గుడి విషయంలో కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ ఆడియో క్లిప్‌ను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.

పోలీసుల చేతికి ఆడియో టేప్...
'గుడి కూలిపోతే వామన్‌రావు కూలిపోతాడు..' అని ఆ ఆడియో క్లిప్‌లో కుంట శ్రీను మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వామన్‌రావు డ్రైవర్ ద్వారా ఈ ఆడియో క్లిప్‌ను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆడియో క్లిప్‌లో ఉన్న పూర్తి వివరాలేంటి...ఎవరితో మాట్లాడుతూ కుంట శ్రీను ఈ బెదిరింపు వ్యాఖ్యలు చేశాడన్నది ఇంకా తెలియరాలేదు. కుంట శ్రీను గతంలో సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస)లో పనిచేసినట్లుగా సమాచారం. మాజీ ఎంపీటీసీ,ప్రస్తుత టీఆర్ఎస్ మంథని మండల అధ్యక్షుడైన అతనిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

హత్యలో పాల్గొన్నది ఐదుగురు?
బుధవారం(ఫిబ్రవరి 17) మధ్యాహ్నం వామన్‌రావు దంపతులను హత్య చేసిన సమయంలో మొత్తం ఐదుగురు వ్యక్తులు అక్కడ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కుంట శ్రీను,హత్యలో పాల్గొన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వామన్‌రావు తండ్రి ఫిర్యాదు మేరకు ఏ-1గా కుంట శ్రీనివాస్, ఏ-2గా అక్కపాక కుమార్, ఏ-3గా వసంతరావును పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ గురువారం(ఫిబ్రవరి 18) సాయంత్రం మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

సీబీఐకి అప్పగించాలని పిటిషన్
వామన్‌రావు దంపతుల హత్యపై విచారణను సీబీఐకి అప్పగించాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శంకర్ అనే న్యాయవాది ఈ కేసును సీబీఐ చేత విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వామన్‌రావు హత్యను ఖండిస్తూ గురువారం హైకోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్రంలో న్యాయవాదులకు భద్రత లేకుండా పోయిందని వాపోయారు. వామన్‌రావు దంపతుల హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.