వైఎస్ షర్మిలకు మోడీ ఫోన్ కాల్- వాటిపై ఆరా ! జగన్ తో చర్చ రూమర్ల వేళ ప్రాధాన్యం..
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇవాళ ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఉదయం 11గంటల సమయంలో ఆమెకు ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు 10 నిమిషాలకు పైగా వీరిద్దరి మధ్య సంభాషణ సాగినట్లు తెలుస్తోంది. ఇందులో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
ముఖ్యంగా వైఎస్ షర్మిల పాదయాత్ర, టీఎర్ఎస్ కల్పిస్తున్న అడ్డంకులు, హైదరాబాద్ లో తాజాగా చోటు చేసుకున్న ఘటనలు, తెలంగాణలో రాజకీయ పరిస్ధితులు మారుతున్నతీరుపై ప్రధాని మోడీ.. షర్మిల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిలను మోడీ ఫోన్ ద్వారానే పరామర్శించినట్లు తెలుస్తోంది. దీంతో షర్మిలకు ప్రధాని మోడీ చేసిన ఫోన్ కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఈ ఫోన్ కాల్ తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్ రాజకీయాలకు సంకేతంగా కూడా కనిపిస్తోంది.

మరోవైపు నిన్న ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ను ఆయన చెల్లెలు షర్మిల గురించి ప్రధాని మోడీ ఆరా తీసినట్లు వార్తలొచ్చాయి. షర్మిలను టీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో మీరు స్పందించరా అని మోడీ జగన్ ను ప్రశ్నించినట్లు ఈ వార్తల సారాంశం. అయితే ఈ వార్తల్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. ప్రధాని మోడీ-జగన్ భేటీలో అక్కడ మూడో మనిషి కూడా లేరని, అటువంటప్పుడు ఇవి ఎల్లోమీడియా వండి వారుస్తున్న వార్తలేనని తేల్చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నేరుగా వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి మాట్లాడటం ఈ వార్తల్ని నిజమనిపించేలా చేసింది.
అరే...! అసలక్కడ మూడో వ్యక్తే లేరు. పచ్చ కుల మీడియా గాలి పోగేసి వార్తలు రాస్తోందని చెప్పేందుకు ఇదో మచ్చుతునక. తెలుగు ప్రజలకు పట్టిన ఈ దరిద్రం 2024తో వదిలిపోతుంది. pic.twitter.com/toOa6l0xzt
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 6, 2022












Click it and Unblock the Notifications