పోలవరంతో భద్రాద్రికి ముంపు తప్పదు: ఆ గ్రామాలు తెలంగాణలోకి, పువ్వాడ కీలక డిమాండ్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రచలానికి ముంపు తప్పదన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్. ఇటీవల వచ్చిన భారీ వరదలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు.

పోలవరంతో భద్రాద్రికి ముప్పే, ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలి
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముంపు ప్రమాదం పొంచివుందని, అందుకే ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే భద్రాచలం వద్ద 45 అడుగుల వరద ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసిన ఏడు మండలాలు, భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని మంత్రి డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణ విలీనం చేయాలని కోరారు. పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు కోరామని చెప్పారు.

ముంపు బాధితులకు రూ. 1000 కోట్లు కేటాయింపు
భద్రాచలం ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ముంపు వల్ల 840 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, ఇప్పటి వరకు 220 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధించినట్లు మంత్రి అజయ్ తెలిపారు. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ముంపు ప్రజల కోసం సీఎం కేసీఆర్ రూ. 1000 కేటాయిచారని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. దాదాపు 72 అడుగుల గోదావరి ప్రవాహం, 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి.

రేపట్నుంచి వరద బాధితులకు పరిహారం జమ
భద్రాచలం కరకట్ట ఎత్తు మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. అడ్ర భూభాగం నుంచి గోదావరి నీళ్లు ఎక్కువగా గ్రామాల్లోకి వస్తున్నాయన్నారు. కరకట్ట నిర్మాణం కోసం నిపుణుల బృందం పంపి, త్వరలోనే నిర్మాణం చేపడతామని సీఎం చెప్పారని తెలిపారు. వరదనీరు తగ్గడంతో పునరావాస కేంద్రాల్లోని ప్రజలందరూ తిరిగి ఇళ్లల్లోకి వెళ్తున్నారని పువ్వాడ అజయ్ తెలిపారు. వరదల కారణంగా 25వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు.8వేల కుటుంబాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైందన్నారు. బుధవారం నుంచి వరద బాధితులకు పరిహారం అందజేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications