హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ సంచలన నిర్ణయం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తమ ఆవరణలోకి న్యూస్ ఛానళ్లు ప్రవేశించడాన్ని నిషేధించింది. ఈ మేరకు ఈ సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
సాధారణంగా- కొత్త సినిమాల విడుదల సమయంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ అభిమానుల తాకిడితో పోటెత్తుతుంటుంది. న్యూస్ ఛానళ్ల ప్రతినిధులు, యూట్యూబర్లు సైతం అక్కడికి చేరుకుంటుంటారు. సినిమా చూసి బయటికి వచ్చిన అభిమానుల ఒపీనియన్లను తీసుకుంటుంటారు. అభిమానుల వద్ద మైక్ ఉంచి- సినిమా రివ్యూల గురించి అడిగి తెలుసుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది.

ఒకవంక సినిమాలను చూడటానికి వచ్చే ప్రేక్షకులు, ఛానళ్ల ప్రతినిధులతో ప్రసాద్ ఐమాక్స్ ఆవరణలో తరచూ గందరగోళ పరిస్థితులు నెలకొంటుంటాయి. ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందులు తలెత్తిన సందర్భాలు లేకపోలేదు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని- రివ్యూలు, ఒపీనియన్లను తీసుకోవడాన్ని తమ ఆవరణలో నిషేధించినట్లు ప్రసాద్ ఐమాక్స్ యాజమాన్యం తెలిపింది.
ఇటీవలే- యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ సమయంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ ఆవరణలో వందలాది మంది గుమికూడిన విషయం తెలిసిందే. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో విడుదల రోజే ఆదిపురుష్ సినిమా చూసిన ఓ అభిమాని- ఇది చెత్తగా ఉందంటూ విమర్శించిన నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు అతనిపై దాడి చేశారు.

న్యూస్ ఛానళ్ల ముందే అతనిపై ఈ దాడి జరిగింది. ప్రభాస్ అభిమానులు అతణ్ని తీవ్రంగా కొట్టారు. పోలీసులు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందీ ఈ ఘటనలో. ఈ ఘటన తరువాత ఇకపై సినిమా రివ్యూలను నిషేధించేలా ఐమాక్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడవి నిజం అయ్యాయి.
ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇకపై తమ ఆవరణలో ఎలాంటి రివ్యూలు ఉండబోవని పేర్కొంది. న్యూస్ ఛానళ్లు, యూట్యూబర్లకు ఆవరణలో ప్రవేశం లేదని తేల్చి చెప్పింది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించిది.












Click it and Unblock the Notifications