హైదరాబాద్‌లో భారీ వర్షం: మరో రెండు గంటలపాటు అలర్ట్, బయటికి రావొద్దు!
హైదరాబాద్: నగరం మరోసారి భారీ వర్షంతో తడిసి ముద్ధయింది. మంగళవారం రాత్రి నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రహదారులపై వరదనీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జాం అయ్యింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో పాదచారులు, వాహనదారులు మెట్రో పిల్లర్ల కిందకు చేరారు.
మంగళవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురిసింది. సరూర్ నగర్, చంపాపేట్, సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్ పేట్, చాదర్‌ఘాట్, కోఠి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఐఎస్ సదన్, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది.

మరో రెండు గంటలపాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షం నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. అగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
అగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మే 10 నాటికి తుపానుగా బలపడుతుందని పేర్కొంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా మే 11 వరకు కదిలి తర్వాత దిశ మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వైపు వెళ్తుందని తెలిపింది. ఉపరితల ద్రోణి తెలంగాణ నుంచి తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications