Rains in Telangana: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. తెలంగాణలో మరో 24గంటలు భారీ వర్షాలు...
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాబోయే 8 గంటల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ మల్కాజ్‌గిరి,రంగారెడ్డి,సంగారెడ్డి,మెదక్,యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్‌లో బుధవారం (జులై 13) రాత్రి నుంచి ఎడతెరిపి లేని కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌పేట్ , పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్‌లోని పలు కాలనీల్లోకి వరద నీరు భారీగా చేరింది.ముసారాంబాగ్ బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

రామంతపూర్‌లోని కొన్ని ఇళ్లల్లో వరద నీరు చేరింది. రాంనగర్,ప్రేమ్ నగర్,పటేల్ నగర్ పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో అత్యధికంగా 21.2సెం.మీ వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్ మెట్‌లో 20సెం.మీ,వనస్థలిపురంలో 19.2సెం.మీ,హస్తినాపురంలో 19సెం.మీ,అంబర్‌పేటలో 18సెం.మీ,సరూర్ నగర్‌లో 17.9సెం.మీ,హయత్‌నగర్‌లో 17.2సెం.మీ,రామాంతపూర్‌లో 17.1సెం.మీ వర్షపాతం నమోదైంది.
రాబోయే 8 గంటల్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.