బీఆర్ఎస్‌పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి: రవితేజ, బ్రహ్మానందంలా బీజేపీ, టీఆర్ఎస్..
హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీల మధ్య మిత్ర భేదం తప్ప శత్రు బేదం లేదన్నారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులతో రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు వివిధ అంశాలపై చర్చించారు.

కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారంటూ రేవంత్.. రాహుల్ యాత్రపైనా
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం పై ముఖ్య నేతలతో చర్చించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం నుంచి 14 తేదీ వరకు ముఖ్య నేతలంతా మునుగోడు ప్రచారంలోనే ఉంటామన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో ఏఐసీసీ నేతలు మాట్లాడుతున్నారు..కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర అక్టోబర్ 23న ఉదయం 7 గంటలకు తెలంగాణలో ప్రవేశిస్తుందన్నారు. అక్టోబర్ 31న ఇంధిరా గాంధీ వర్దంతి సందర్భంగా నక్లెస్ రోడ్‌లో భారీ కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని రేవంత్ తెలిపారు.
రెండు రోజుల్లో పాదయాత్ర రూట్ మ్యాప్ స్పష్టత ఇస్తామన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్‌లపై రేవంత్ రెడ్డి సెటైర్లు
బీజేపీ ,టిఆర్ఎస్ మధ్య మిత్ర భేదమే తప్ప, శత్రు భేదం లేదని రేవంత్ అన్నారు. వాటాల పంపకం విషయంలోనే టిఆర్ఎస్ ,బీజేపీ మధ్య పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ ,బ్రహ్మానందతో టిఆర్ఎస్ ,బీజేపీలను పోల్చారు రేవంత్ రెడ్డి.
గులాబీ నేతల వసూళ్ల పై కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తానని రేవంత్ తెలిపారు.

బీఆర్ఎస్‌పై ఢిల్లీ కోర్టుకు రేవంత్ రెడ్డి
మరోవైపు, టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా గుర్తించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని రేవంత్ ప్రకటించారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన పిటిషన్ పై తేల్చే వరకు పార్టీ పేరును మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు పార్టీ కోసం నిధులు వసూలు చేశారని, టీఆర్ఎస్ గుర్తింపును రద్ధు చేయాలని కోరుతూ గతంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గులాబీ కూలీ పేరుతో నిధుల వసూళ్ల అంశాన్ని పరిశీలించాలని ఈసీని ఢిల్లీ హైకోర్టు కోరినా.. ఎటువంటి చర్య లేదని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.

మునుగోడులో అద్భుతమైన ఫలితమంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని అన్నారు. నవంబర్ 6న అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారన్నారు.
మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ ఎంపీలపై చేసిన వాఖ్యలు నిరాధారణమైనవన్నారు. తాను భారత్ జోడో కో-ఆర్డినేటర్‌గా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటారన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మునుగోడులో ఎలాంటి వ్యూహం అవలంభించాలనేదానిపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్య నేతలంతా మునుగోడుపై దృష్టి సారించినట్లు తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎలాంటి అనుమానాలు వద్దని.. పార్టీ విజయం కోసం ఆయన పనిచేస్తారన్నారు. వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని ఎవరు డిమాండ్ చేశారో తనకు తెలియదన్నారు.












Click it and Unblock the Notifications