• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జయరామ్ హత్య కేసులో నోరువిప్పిన శిఖా చౌదరి. సంచలన విషయాలు వెల్లడి

|

హైదరాబాద్: ఎన్నారై వ్యాపారి జయరాం హత్య కేసుపై ఆమె మేనకోడలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖాచౌదరి గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తలు తనను బాధిస్తున్నాయన్నారు. మామయ్య కంపెనీలోకి రాకముందే తనకు లగ్జరీ కార్లు ఉన్నాయని, మామయ్య చనిపోయాడని తెలిసి తాను తొలుత ఆయన ఇంటికి వెళ్ళడం వాస్తవమేనని, కానీ తన ప్రాజెక్టు డాక్యుమెంట్లు తెచ్చుకోవడానికి వెళ్లానని చెప్పారు.

శిఖా చౌదరి. కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వినిపిస్తోన్న పేరు. సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాననిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. హత్యకు గురైన జయరాంకు స్వయానా మేనకోడలు. గురువారం సాయంత్రం ఆమె తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె చెప్పిన విషయాలు ఇవీ..

నేను అమాయకురాలి. ఇన్ని రోజులుగా నేను సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికీ మాట్లాడే స్థితిలో లేను. షాక్ లో ఉన్నా. నా చుట్టే కేసును ఉద్దేశపూరకంగా తిప్పుతున్నారు. నా ప్రమేయం ఏమీ లేదు. ఇది చెప్పడానికి నేను మీడియా ముందుకు వచ్చాను. జనవరి 1 నుంచి జయరాం అమెరికా నుంచి వచ్చారు. ఆ సమయంలో నేను హైదరాబాద్ లో లేను. 10-12 రోజుల తరువాత కంపెనీ పని మీదే నేను ఆయనను కలిశాను. ఎప్పుడూ పెద్దగా కలవను. కంపెనీ పని మీదే కలిశాను. 29న ఓ ప్రాజెక్ట్ విషయంలో నన్నుకలవడానికి జయరాం వచ్చారు. నేను సొంతంగా అమెరికన్ క్లయింట్లను తెచ్చుకుని ప్రాజెక్ట్ ను ప్రారంభించాలనుకుంటున్నాను. అదే సమయంలో జయరాం ఇంటికి వచ్చారు. ఇద్దరం కలిసి భోజనం చేశాం. ఆ తరువాత ఆయన వెళ్లిపోయారు. ఆ ప్రాజెక్ట్ ఫైల్ ను చదవడానికి జయరాం తీసుకెళ్లారు. అందులో తప్పు ఒప్పులను సరి చేస్తానని తీసుకెళ్లారు.

Shikha Chowdary who allegedly involved in Jayaram murder told I am Innocent

మా డ్రైవరే అంకుల్ ను ఆయన ఇంటి వద్ద డ్రాప్ చేశారు. 29న రాత్రి వాట్సప్ చేశారు. నేను 30న ఉదయం వాటిని చూశాను. కంపెనీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోందని అంకుల్ చెప్పారు. అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తానని వాట్సప్ మెసేజ్ ఇచ్చారు. ఏదైనా అవసరం ఉంటే తప్ప మేము ఫోన్ చేయం. సాయంత్రం 4:30కు కాల్ చేశారు. ఇండియన్ నంబర్ నుంచి ఫోన్ చేశారు. అర్జంట్ గా 100 కోట్ల రూపాయలు కావాలని అడిగారు. నేను షాక్ కు గురయ్యారు. సమాధానం చెప్పేలోగా కాల్ కట్ చేశారు. మళ్లీ ఫోన్ చేశారు. సాయంత్రం లోగా ఏ విషయమైంది చెబుతానని అన్నాను. 31న ఉదయం 10:30కు మళ్లీ ఫోన్ చేసి, వంద కోట్ల డబ్బులు అడిగారు. ఎందుకు అడుగుతున్నారని నేను ప్రశ్నించాను. 4 కోట్ల రూపాయల అప్పు ఉందని, వారి నుంచి ఒత్తిడి ఉందని వారికి ఇవ్వాల్సి ఉందని జయరాం సమాధానం ఇచ్చారు. హడావుడిగా డబ్బులు అడిగి ఫోన్ పెట్టేశారు. ఎవరి దగ్గర తీసుకున్నావు అని అడిగాను. 31న ఆయన ఎక్కడి నుంచి ఫోన్ చేశారనేది కూడా నాకు తెలియదు. నీరసంగా, బలహీనంగాచ టెన్షన్ గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. సాధారణంగా ఆయన టెన్షన్ పడరు. ఎక్స్ ప్రెస్ టీవీలో ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు డబ్బులు సర్దుబాటు చేశాను. ఎక్స్ ప్రెస్ టీవీ తరువాత ఏడాదిన్నరగా నేను ఆయనతో టచ్ లో లేను. నేను వాట్సప్ చేసినప్పటికీ.. అది డెలివరీ అవ్వలేదు. ఆయన ఫోన్ నంబర్ మావయ్య అని నా ఫోన్ లో ఫీడ్ అయి ఉంటుంది. ఆయన ఫోన్ చేసిన నంబర్ కు మెసేజ్ పెట్టాను. ఫలానా వాళ్లదగ్గర అడగొచ్చు కదా అని మెసేజ్ పెట్టాను. ఫలానా వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నట్టు ఆయన నాకు ఎప్పుడూ చెప్పలేదు. అకౌంట్ల వివరాలను నాకు తెలియవు. ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచావు అని అడిగాను.

సమాధానం రాలేదు. 31న ఉదయం 10:30 తరువాత చివరిసారిగా ఫోన్ చేశారు. ఆ తరువాత ఫోన్ కాంటాక్టులు లేవు. సాయంత్రం మా అమ్మ నాకు ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని చెప్పారు. కారు ప్రమాదం జరిగిందని మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ వెంటనే కోస్టల్ బ్యాంకు ఎండీగా పనిచేసిన ఈశ్వర్ రావుకు ఫోన్ చేశాను. ఏమైందని అడిగాను. తనకు కూడా పూర్తి సమాచారం లేదని చెప్పారు. ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లడానికి బట్టలు సర్దుకుని వెళ్లడానిక రెడీ అవుతుండగా, అమ్మ ఫోన్ చేశారు. డెడ్ బాడీని హైదరాబాద్ కే తీసుకొస్తున్నారని అమ్మ ఫోన్ ద్వారా చెప్పారు. నేను దాని కోసమే అక్కడికి వెళ్లాను. ప్రాజెక్ట్ ఫైల్ కోసం నేను అంకుల్ ఇంటికి వెళ్లానని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మా అత్తకు, మామయ్యకు చాలాకాలంగా మాటలు లేవు.

ఆ ఫైల్ మాత్రమే నేను మామయ్య ఇంటి నుంచి తెచ్చుకున్నాను. దీనికి వాచ్ మెన్ సాక్ష్యం. ఫైల్ తెచ్చుకునేటప్పుడు ఆయన నా వెంటే ఉన్నారు. అలా తెచ్చుకోవడం తప్పే అని నాకు తరువాత అర్థమైంది. జయరాం ఆస్తులతో నాకు సంబంధం లేదు. జగ్గయ్య పేటలో ఉన్న భూమి ఎవరి పేరుమీద ఉందో కూడా నాకు తెలియదు. ఆ ఆస్తిని కొన్నట్లు రెండేళ్ల కిందటనాకు తెలిసింది. ఆ ఆస్తి నా పేరు మీద ఉందా? లేదా? అనేది నాకు తెలియదు. ఫైల్ కోసం నేను మామయ్య ఇంటికి వెళ్లాను అలా వెళ్లడం తప్పని నాకు తరువాత తెలిసింది.రాకేశ్ రెడ్డి నాకు 2017లో పరిచయం అయ్యారు. టెట్రాన్ కంపెనీ కొన్నాళ్లుగా సమస్యల్లో ఉంది. నేను ఎక్స్ ప్రెస్ టీవీలో ఉన్నప్పుడు ఆయన నా పనితీరును మెచ్చుకున్నారు. టెట్రాన్ కంపెనీలో గొడవలు ఉన్నదని నాకు మామయ్య చెప్పారు. దీన్ని హ్యాండిల్ చేయాలని మామయ్య నాకు చెప్పారు. మామయ్య కూడా వచ్చే వాళ్లు. చెక్స్ కూడా రాకేశ్ రెడ్డి ఇచ్చారు. ఎక్స్ ప్రెస్ టీవీలో డబ్బులు ఎక్కువ ఖర్చు కావడం వల్ల కంపెనీ కార్మికులకు డబ్బులు సెటిల్ చేయలేకపోయారు. రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి నేను సెటిల్ చేస్తానంటూ వచ్చారు. అయిదారుగురికి ఆయనే సెటిల్ చేశారు. మామయ్య ద్వారానే నాకు పరిచయం అయ్యారు. రాకేశ్ రెడ్డితో పాటు మరో ముగ్గురు, నలుగురు నాకు పరిచయం అయ్యారు. ఆ తరువాత టచ్ లో ఉన్నారు. రోజూ రెగ్యులర్ గా ఏడెనిమిది నెలలు మాట్లాడారు. అతను అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నాడని తెలిసి దూరం అయ్యాను. మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు. రాకేశ్ రెడ్డిని చివరి సారిగా తొమ్మిది నెలలు దాటి పోయింది. అప్పటి నుంచీ అతనితో టచ్ లో లేను. అతని ప్రవర్తన నచ్చక దూరంగా ఉన్నాను. ఇదే విషయాన్ని నేను మామయ్యకు కూడా చెప్పాను. అతని విషయాన్ని కూడా నేను మామయ్యకు చెప్పాను. టెట్రాన్ కంపెనీ ద్వారా మామయ్యకు, రాకేశ్ రెడ్డి మధ్య పరిచయం ఏర్పడింది. మామయ్య అడిగిన నాలుగు కోట్ల రూపాయలు రాకేశ్ రెడ్డికే ఇవ్వాలనే విషయం నాకు తెలియదు. విచారణ సందర్భంగా పోలీసులు మాట్లాడుకుంటుండగా ఈ నాలుగు కోట్ల రూపాయలు రాకేశ్ రెడ్డికి ఇవ్వాలనే విషయం నాకు తెలిసింది. మామయ్య గురించి తెలిసిన వాళ్లు గానీ, వ్యాపారస్తులు గానీ మామయ్యను చంపాలను ఎప్పుడూ అనుకోరు. ఓ చిన్న విషయంలోనే ఇలా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రాకేశ్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నారనే విషయం నాకు తెలియదు.

అన్ని కంపెనీలు నడపాలంటే డబ్బులు ఎప్పుడూ అవసరం అవుతాయి. డబ్బులు అప్పటికప్పుడు సర్దుబాటు కాకపోవచ్చు. ఇందువల్లే తీసుకుని ఉండవచ్చని అనుకుంటున్నాను. రాకేశ్ రెడ్డి మామయ్యకు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి ఉండొచ్చని నేను అనుకోను. నాలుగు కోట్ల రూపాయల కోసమే మామయ్య ప్రాణం తీశారని మూడు రోజుల కిందటే నాకు తెలిసింది. అంకుల్ చనిపోవడం వల్ల ఎవ్వరికీ లాభం లేదు. ఆయన జీవించి ఉంటే అందరికీ లాభమే. ఒకవేళ రాకేశ్ రెడ్డి ఈ హత్య చేసి ఉంటే నాలుగు కోట్ల రూపాయల కోసమే చేసి ఉండొచ్చని అనుకుంటున్నాను. రాకేశ్ రెడ్డి మామయ్యకు నాలుగు కోట్లు ఇచ్చేంత స్థోమత లేదు. మా అత్త (పద్మశ్రీ) కు కంపెనీల గురించి పెద్దగా తెలియవు. ఇండియాలో నష్టాల్లో ఉన్న ఎక్స్ ప్రెస్ టీవీ, టెట్రాన్ కంపెనీల్లో నేను డైరెక్టర్ గా ఉన్నాను.

షేర్ల ట్రాన్స్ ఫర్ కోసం, నామమాత్రంగా కోసమే నా పేరును మామయ్య డైరెక్టర్ గా పెట్టారు. టెట్రాన్ కంపెనీలో నాకు షేర్లు లేవు. ఆయన కంపెనీల్లో పని చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎక్స్ ప్రెస్ టీవీ విషయంలోనూ అదే జరిగింది. కేవలం మామయ్యకు సహకరించడానికే అందులో చేరాను. ఈ విషయం ఆంటీకి ఇష్టం లేదు. నాకు మెసేజీలు చేసేవారు. నేను ఛానల్ కు వచ్చిన తరువాతే ఎక్స్ ప్రెస్ టీవీ నష్టపోయిందని అంటున్నారు. అది సరి కాదు. ఆరేడు నెలల తరువాత నేను ఎక్స్ ప్రెస్ టీవీలో చేరాను. నష్టాల్లో ఉన్నప్పుడు ఆ టీవీలో చేరాను. ఓ స్థాయికి తీసుకొచ్చిన తరువాత నేను బయటికి వచ్చాను. ఈ విషయం మీడియా ప్రతినిధులకు కూడా తెలుసు. కోస్టల్ బ్యాంకు వ్యవహారం నాకు తెలియదు. నేను ఎందుకు ఆయనను హత్య చేస్తాను? ఆయనకు ఉన్న కంపెనీలు గానీ, షేర్లు గానీ, ఆస్తులు గానీ, ఇన్స్యూరెన్స్ గానీ ఆయన భార్య, పిల్లలకే వెళ్తాయి తప్ప నాకు రావు. శిఖా చౌదరి అనే పేరు తప్ప మరొకటి వినిపించట్లేదు. ఆస్తులు నా పేరు మీద లేవు. జీతం కోసం ఆయన కంపెనీల్లో చేరాను. శిఖా చెప్పిందని ఆవిడ (పద్మశ్రీ) ఇప్పుడు చెబుతున్నారు. ఎవరికి తోచిన స్క్రిప్ట్ వారు రాసుకున్నారు. నాలుగైదు రోజులుగా టీవీ ఛానళ్లలో అదే చూపిస్తున్నారు. ఇందులో పద్మశ్రీ హస్తం కూడా ఉందని నేను అనుకోను. ఎవరైనా ఆమె ద్వారా నాపై ఆరోపణలు చేయిస్తున్నట్టు ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్న కంపెనీలకు అవసరమైతే రాజీనామా ఇప్పుడే చేస్తా. రాకేశ్ రెడ్డిని అంకుల్ కూడా దూరంగా ఉంచారు. అతను సరైన వ్యక్తి కాదని మామయ్య నాకు చెప్పారు.

కొన్ని ఆరోపణలకు సమాధానం ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. అవన్నీ నిరాధారమైనవి. రాకేశ్ రెడ్డితో నేేను టచ్ లోనే లేను. అలాంటప్పుడు అతనికి దూరంగా ఉండమని మామయ్య నాకు ఎందుకు చెబుతారు? అలాంటి చర్చే రాలేదు. అతను నా దగ్గరికి వచ్చి గొడవ పడి ఉండొచ్చు గానీ, మామయ్యతో ఎందుకు గొడవ పడతారు? హత్యకు ముందు రోజు రాత్రి ఓ ఫ్రెండ్ తో కలిసి కారులో బయటికి వెళ్లొచ్చాను. ఆ ఫ్రెండ్, ఈ గొడవతో సంబంధం లేదు. తెలంగాణ పోలీసుల విచారణకు నేను తప్పకుండా సహకరిస్తాను. వారికి కూడా మద్దతు ఇస్తాను. నేను డబ్బులు ఇచ్చి కేసు నుంచి బయటపడ్డాననే ఆరోపణలు ఉన్నాయని నాకూ తెలుసు. నేను ఎలా మేనేజ్ చేయగలుగుతాను? రాకేశ్ రెడ్డి టీడీపీ వ్యక్తి. అతనికి ఎవరితోనో సంబంధాలు ఉంటే నాకు ఎలా తెలుస్తుంది. కబాలి నిర్మాత చౌదరి నాకు అన్నయ్య లాంటి వారు. తోడు రమ్మంటే నాతో పాటు వచ్చారు. బయట నుంచునే ఉన్నారు. స్టేషన్ లోనికి రాలేదు. ఆయన ఎక్కడా జోక్యం చేసుకోలేదు. నా వైపు నుంచి ఏ తప్పు లేదు. నేనుందుకు భయపడాలి? పోలీసులు రమ్మనగానే వెళ్లాను. పోలీసులు కూడా నాపై అనుమానం వ్యక్తం చేసి ఉండవచ్చు. కాల్ డేటా గానీ, ఇతర వివరాలపై విచారణ చేసిన తరువాతే నన్ను ఏపీ పోలీసులు నిర్దోషిగా తేల్చారు.

ఒక్క రూపాయి కూడా నేను కంపెనీల నుంచి తీసుకోలేదు. తెలంగాణ పోలీసులు కూడా న్యాయంగానే కేసు విచారణ చేస్తారని అనుకుంటున్నాను. జయరాం అంత్యక్రియలకు నేను వెళ్లలేదు. మృతదేహాన్ని మార్చురీలో పెట్టాలని చెబితే నేను వెళ్లలేకపోయాను. అత్తయ్య అమెరికా నుంచి రావాలని అంత్యక్రియల్లో జాప్యం చేశారు. మా అమ్మ షాక్ లో ఉన్నారు. ఈ వార్తలను రోజూ చూసి అమ్మ తేరుకోలేక పోయారు. మా చెల్లెలు ఎంబీబీఎస్ సీటుకు జయరాం సహాయం చేశారు. మా చెల్లెలు పీజీకి మేమే డొనేషన్ కట్టాం. జయరాంకు నాకు చాలా రోజుల నుంచీ మాటలు లేవు. డాక్టర్ రెడ్డీస్ వంటి చోట్ల పని చేసేవారు. బిజీగా ఉండేవారు. ఎలాంటి సమస్యనైనా హ్యాండిల్ చేయగలరు. నష్టాల్లో ఉన్న కంపెనీలను హ్యాండిల్ చేయడానికే నన్ను రమ్మన్నారు. 2009 చివరలో జయరాంతో కలిశాను. కోటీశ్వరుడైనప్పటికీ.. నేను ఆయనను కలవలేదు. ఎక్స్ ప్రెస్ టీవీ, టెట్రాన్ కంపెనీలు నష్టాల్లో ఉన్నప్పుడే వాటిని డెవలప్ చేయడానికి నేను ఆయనను కలిశాను. పద్మశ్రీ తన భర్త జయరాంకు ఉన్న చెక్ పవర్ ను నిలిపి వేయడం వల్లే కొన్ని నిధులు రాకపోవడం వల్లే ఎక్స్ ప్రెస్ మూతపడిందనే విషయం నాకు తెలియదు. పోలీసుల దర్యాప్తులో ఎవరి విధానాలు వారికి ఉన్నాయి. కేసును తెలంగాణ పోలీసుల చేతికి రావడం వల్ల నేను దోషిగా తెలుతాననే భయం నాకు లేదు. నేను నిర్దోషిని. ఎన్ని స్టేట్ పోలీస్ స్టేషన్లకు అప్పగించినా నాకు అభ్యంతరం లేదు. నేను తీసుకున్నది నా ప్రాజెక్ట్ ఫైల్ ను మాత్రమే. రాకేశ్ రెడ్డి నాతో టచ్ లో ఉండి ఉంటే అతను నా గురించి వాచ్ మెన్ కు డబ్బులు ఇచ్చి సమాచారం ఎందుకు తీసుకుంటాడు. మొదట పద్మశ్రీ నాకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆమె నాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు రోజులుగా మీడియాలో నా పేరే వినిపిస్తోంది. ఎలాంటి సంబంధం లేని టాపిక్ అది. దీనివల్ల పద్మశ్రీ కేసు ఫైల్ చేసి ఉండవచ్చు లేదా ఎవరైనా ఎంకరేజ్ చేస్తుండవచ్చు. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధమూ లేదు. ఏపీ పోలీసులకు ఎలా సహకరించానో, తెలంగాణ పోలీసులకు కూడా సహకరిస్తాను. అవసరమైతే నేను కూడా న్యాయపోరాటం చేస్తాను. సంబంధం లేకపోయినా, క్లీన్ చిట్ ఇచ్చినా కూడా మళ్లీ నా పేరును రిపీట్ చేస్తున్నారు. నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ హత్య కేసులో అన్ని రకాలుగా నష్టపోయింది నేను, నా కుటుంబమే. మిగిలిన వారందరూ లాభ పడ్డారు. ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది.. అంటూ ఆమె ముగించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shikha Chowdary who allegedly involved in Jayaram murder told I am Innocent
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more