SI Mains Exams: ముగిసిన ఎస్సై తుది పరీక్షలు..
తెలంగాణలో రెండు రోజుల పాటు జరిగిన ఎస్సై మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. తుది పరీక్షకు 96 శాతం అభ్యర్థులు హాజరైనట్లు తెలిసింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లోని 81 కేంద్రాల్లో రెండు రోజుల పాటు ఎస్‌ఐ రాత పరీక్ష నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 587 పోస్టులకు గానూ తొలుత 2 లక్షల 47వేల 630 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 7న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించారు. అక్టోబర్ లో ఫలితాలు ప్రకటించారు. దేహదారుఢ్య ఫలితాల అనంతరం వీరిలో 59వేల 574 మంది మాత్రమే అర్హత సాధించారు.
ఎస్‌ఐ(సివిల్), ఎస్‌ఐ(ఐటీ), ఎస్‌ఐ(పీటీఓ), ఏఎస్‌ఐ(ఫింగర్ ప్రింట్) విభాగంలో 4 పేపర్లకు పోలీసు నియామక మండలి పరీక్షలు జరిపింది. త్వరలోనే వెబ్‌సైట్‌లో ప్రిలిమినరీ 'కీ' అందుబాటులో ఉంచుతామని అధికారులు చెప్పారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర బాలానగర్ జోన్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, జీడిమెట్ల, చింతల్‌లోని పాపయ్యయాదవ్ నగర్‌లోని రెయిన్ బో గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ గర్ల్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. త్వరలో కానిస్టేబుల్ తుది పరీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications