తెలంగాణలో రేపట్నుంచి పాఠశాలలు ప్రారంభం: ఎలాంటి పొడిగింపు లేదు
హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థులకు నేటితో వేసవి సెలవులు ముగిశాయి. దీంతో రేపట్నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో రేపట్నుంచి(జూన్ 13) పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్నాయని తెలిపారు.
అంతేగాక, వేసవి సెలవులు పొడిగింపు లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది పిల్లలకు స్వాగతం పలుకుతున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు వారికి సమీపంలో ఉన్న పాఠశాలల్లో పిల్లలకు స్వాగతం పలకాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యనందించేందుకు కృషి చేసినట్లు చెప్పారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 9వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు.
మరోవైపు, ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందని మంత్రి సబిత తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీ మీడియంలో బోధన ఉంటుందన్నారు. దీనికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. విద్యార్థులకు యధావిధిగా పుస్తకాలు, యూనిఫాం అందిస్తామని మంత్రి తెలిపారు. టెట్ పరీక్ష నిర్వహణ బాగా జరిందని తెలిపారు.
కాగా, కరోనా కేసులు రాష్ట్రంలో క్రమంగా పెరుగుతుండటంతో పిల్లల తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే,కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications