కేసీఆర్ సర్కారుకు వీడ్కోలు విందు టైమొచ్చింది: బండి అరెస్టుపై తరుణ్ ఛుగ్, విజయశాంతి
హైదరాబాద్: ఎంపీ బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ ఛుగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తీరును ఆయన తప్పుబట్టారు. బండి సంజయ్‌ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అరెస్టుకు కారణాన్ని వెల్లడించడంలో తెలంగాణలో విఫలమయ్యారన్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూను బీజేపీ ప్రశ్నిస్తున్నందుకే తమ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తరుణ్ ఛుగ్. ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ముందే.. సీఎం కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అహంకారానికి బండి సంజయ్ అరెస్ట్ ఒక నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌కు భయపడేది లేదని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. పరిపాలన తీరును ప్రశ్నిస్తే జైల్లో వేస్తామంటే.. బీజేపీ నాయకులెవరూ భయపడరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్న తరుణ్ ఛుగ్.. చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌కు వీడ్కోలు విందు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చిందని ఆరోపించారు.

మరోవైపు, తెలంగాణ బీజేపీ నేతలతో తరుణ్ ఛుగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా గురువారం సామూహిక ప్రతిజ్ఞలు చేయాలని పిలుపునిచ్చారు. రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ కార్యకర్తలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతారని చెప్పారు.
కేసీఆర్ దేనికైనా వెనుకాడడు: విజయశాంతి : తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఇలాంటి చర్యలకు BRS పాల్పడుతుందనే విషయం తమకు ముందే తెలుసనని ఆమె అన్నారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసన తెలిపేందుకు బయలుదేరిన విజయశాంతిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బండి సంజయ్ అరెస్టు, పేపర్ లీక్ వ్యవహారంపై విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ సంగతి బాగా తెలుసని.. దేనికైనా వెనుకాడడని మండిపడ్డారు.
బండి సంజయ్ కుమార్‌ని అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రతిబింభిస్తుంది. మీ అనైతిక అరెస్టులకు కారణాలు మీరు చూపలేకపోవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో BRS పార్టీని భూస్థాపితం చెయ్యడానికి అనేక కారణాలు,ఆధారాలతో యావత్ తెలంగాణా సమాజం , యువత ఎదురుచూస్తుంది అని విజయశాంతి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications