జీతాల కోసం ఆందోళన బాట పట్టిన తెలంగాణా సినిమా థియేటర్ల సిబ్బంది..ప్రభుత్వం ఆలోచిస్తుందా?
కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా సుమారు 9,600 థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌లు మరియు సింగిల్-స్క్రీన్ సినిమాహాళ్ళు మూత పడ్డాయి దీంతో థియేటర్లలో పని చేసే సాంకేతిక సిబ్బందితో పాటు థియేటర్ల మీద ఆధారపడి జీవించే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. . కరోనా లాక్ డౌన్ తో థియేటర్లు మూత పడటం థియేటర్ యాజమాన్యాలను దివాలా తీయించే స్థితికి నెట్టగా వారు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఇక ఇప్పుడు మరో రెండు,మూడు నెలలు థియేటర్లు తెరవకపోవచ్చు అన్న భావన వ్యక్తం అవుతున్న తరుణంలో దిక్కుతోచని స్థితిలో ఉంది థియేటర్ల పరిస్థితి.

సినిమాహాళ్ళకు లాక్ డౌన్ నిబంధనల నుండి వెసులుబాటు లేనట్టే
భారతదేశంలో లాక్డౌన్ విధించి రెండు నెలలు కావస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. పైగా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. ఇక తాజా లెక్కల ప్రకారం ఇండియాలో కరోనా కేసులు లక్షకు పైగా నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు .ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా లాక్డౌన్ మే 18 నుండి మే 31 వరకు లాక్ డౌన్ 4.0 పొడిగించనున్నట్లు ప్రకటించారు. పరిస్థితులకు అనుగుణంగా సరైన మినహాయింపులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించింది కేంద్ర సర్కార్ . అన్నిటికీ వెసులుబాటు ఇచ్చినా సినిమాహాళ్ళకు ఇప్పట్లో వెసులుబాటు ఇచ్చే అవకాశం లేదు .

ఆందోళన బాట పట్టిన థియేటర్లలో పని చేసే సిబ్బంది , కార్మికులు
సినిమాహాళ్ళు , పార్కులు, థియేటర్లు, జిమ్ కేంద్రాలు వంటి బహిరంగ సమావేశ స్థలాలను తెరవవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఇక దీంతో రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రధాన కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కానీ థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేనట్టు తాజా సడలింపుల ద్వారా అర్ధం అవుతుంది .ఇక దీంతో తెలంగాణా రాష్ట్రంలోని థియేటర్ కార్మికులందరూ సమ్మె బాట పట్టారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు .

జీతాలు చెల్లించని యాజమాన్యాలపై చర్యలకు డిమాండ్
ఇప్పటివరకు థియేటర్ యాజమాన్యాలు మార్చి మరియు ఏప్రిల్ నెలలకు కార్మికులకు జీతం చెల్లించలేదని ఆందోళన బాట పట్టారు. తమ పరిస్థితిపై ప్రభుత్వాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక సిబ్బందికి , కార్మికులకు జీతాలు చెల్లించని అన్ని థియేటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక యాజమాన్యాలు కరోనా లాక్ డౌన్ తో నిండా మునిగామని , ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదని , అప్పుల్లో, నష్టాల్లో మునిగిపోయామని ఏ విధంగా జీతాలు చెల్లించాలో ప్రభుత్వమే చెప్పాలని అంటున్నారు . ఈ సమయంలో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి .












Click it and Unblock the Notifications