కవిత విచారణ - స్టేట్ మెంట్ రికార్డు : ఆరుగురు సీబీఐ అధికారుల టీం ప్రశ్నలు..!!
కల్వకుంట్ల కవిత సీబీఐకి వివరణ ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచనలానికి కారణమైన ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు కవిత నుంచి వివరణ తీసుకుంటున్నారు. సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స ఆధ్వర్యంలో కవిత నివాసానికి చేరుకున్న ఆరుగురు అధికారుల టీం విచారణ కొనసాగిస్తోంది. ఈ టీంలో ఒక మహిళా అధికారి ఉన్నారు. కవిత న్యాయవాది అక్కడే ఉన్నారు. సీబీఐ కవితను ఈ వివరణ కోరే సమయంలో ఏ ప్రశ్నలు సంధిస్తోందీ.. కవిత ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి గా మారుతోంది.

లిక్కర్ స్కాంలో కవిత ఇంటికి సీబీఐ
కొద్ది రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాల్లో మూలాలు ఉన్నట్లుగా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. కవితతో పాటుగా పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల పేర్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. మొబైల్ ఫోన్లు ధ్వంసం చేసారని రిపోర్టులో పేర్కొంది. దీని పైన కవిత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కేంద్రం ఉద్దేశ పూర్వకంగా రాజకీయ ప్రత్యర్ధుల పైన సీబీఐ - ఈడీలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వాలంటూ సీబీఐ కవితకు లేఖ రాసింది. దీంతో, లేఖకు స్పందనగా ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు - ఎఫ్ఐఆర్ ఇవ్వాలని కవిత సీబీఐకు లేఖ పంపారు.

కవితకు సమాచారం - అంగీకారం
కవిత కోరిన విధంగా సీబీఐ సమాచారం ఇచ్చింది. ఎఫ్ఐఆర్ తో పాటుగా కేసు వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసినట్లుగా సీబీఐ రిప్లై ఇచ్చింది. దీనిని పరిశీలించిన ఫిర్యాదు - ఎఫ్ఆర్ లో ఎక్కడా కవిత పేరు లేదంటూ మరో లేఖ సీబీఐకి రాసారు. అదే సమయంలో నాలుగు తేదీలను సూచిస్తూ..తాను వివరణ ఇవ్వాటానికి సిద్దంగా ఉన్నానంటూ నాలుగు తేదీలు సూచిస్తూ సీబీఐకి మరో లేఖ పంపారు. దీనికి స్పందించిన సీబీఐ ఈ రోజున హైదరాబాద్ లోని కవిత నివాసంలోనే వివరణ తీసుకోవటానికి సంసిద్దత వ్యక్తం చేసింది. అందులో భాగంగా ముందస్తుగా కవిత ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. కార్యకర్తలు ఎవరూ రావద్దని సూచించారు. తన ఇంటికి చేరుకున్న సీబీఐ టీంకు కవిత కావాల్సిన సమాచారం అందిస్తున్నారు. కవిత నివాసంలోనే ఆమె తరపు న్యాయవాది ఉన్నారు.

విచారణ కాదు వివరణ అంటూ..
సీబీఐ అధికారులు కవితను విచారణ కోసం రాలేదని..వివరణ తీసుకొనేందుకు వచ్చారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. కవిత పేరు ఎక్కడా ఫిర్యాదు - ఎఫ్ఐఆర్ లో లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ స్కాం కు సంబంధించి కవిత పేరు ప్రచారంలోకి రావటం.. అమిత్ అరోరా ప్రస్తావనతో ఈ వ్యవహారం రాజకీయంగానూ పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. అదే సమయంలో కవితో పాటుగా గులాబీ పార్టీ నేతలు ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇక, ఇప్పుడు సీబీఐ ప్రత్యేక టీం కవిత నుంచి తమకు కావాల్సిన సమాచారం సేకరిస్తోంది. కవిత సీబీఐ అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన ప్రతీ అంశానికి సమాధానం చెబుతానని స్పష్టం చేస్తున్నారు. దీంతో, ఈ విచారణ ఇప్పుడు రాజకీయంగానూ ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications