Hyderabad: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. వడ్డీ మాఫీ పథకం పొడిగింపు..!
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది. నీటి బిల్లుల బకాయిలపై చెల్లించే వడ్డీ మాఫీ పథకాన్ని పొడిగించింది. ఈ పథకం అక్టోబరు 31 వరకు మాత్రమే ఉండేది. దాన్ని ఇప్పుడు ఒక నెల పొడిగించారు. నవంబర్ 30 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. వన్-టైమ్ సెటిల్‌మెంట్ (OTS-2024) పథకం ద్వారా, కస్టమర్‌లు తమ నీటి బిల్లు బకాయిలను ఎలాంటి వడ్డీ చెల్లించకుండా సెటిల్ చేసుకోవచ్చు.
అక్టోబర్‌లో సుమారు 70,300 మంది వినియోగదారులు తమ బకాయిలు చెల్లించారు. వారికి వడ్డీ మాఫీ చేశారు. బిల్లుల క్లియరెన్స్ ద్వారా రూ. 49 కోట్ల ఆదాయాన్ని పొందారు. నెలాఖరు నాటికి వడ్డీ పెనాల్టీ మొత్తం రూ.17 కోట్లు మాఫీ అయ్యాయి. పథకం కింద, ఇంతకుముందు ఈ ప్రయోజనం పొందని వినియోగదారులకు పూర్తి మినహాయింపు అందుబాటులో ఉంటుంది. మిగిలిన వారికి వడ్డీపై 50 శాతం మాఫీ ఇప్పటికీ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

వడ్డీ మాఫీని అధికారి స్థాయి బట్టి చేస్తారు. మాములు అధికారులు అయితే రూ. 2,000 వరకు వడ్డీని మాఫీ చేయవచ్చు. డిప్యూటీ జనరల్ మేనేజర్లు రూ. 2,001 నుంచి రూ. 10,000 మధ్య వడ్డీని మాఫీ చేయవచ్చు. జనరల్ మేనేజర్లు రూ. 10,001 నుంచి రూ. 1,00,000 మధ్య వడ్డీని మాఫీ చేయవచ్చు. చీఫ్ జనరల్ మేనేజర్లు రూ. 1,00,000 కంటే ఎక్కువ వడ్డీని మాఫీ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం, HMWS&SB వెబ్‌సైట్‌ను సందర్శించాలి. నివాసితులు 155313కు డయల్ చేయడం ద్వారా కస్టమర్ కేర్‌ను కూడా సంప్రదించవచ్చు.
హైదరాబాద్ లో ఇంకా చాలా మంది నల్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయినప్పటికీ బిల్లులు చెల్లించడానికి ఎక్కువగా ముందుకు రావడం లేదు. బిల్లులు చెల్లించకుండా బోర్డ్ ఎలా నడుపుతారని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ముందుకొచ్చి బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications