సబ్బండ వర్గాలకు మేలు .. పట్టణాల్లో రూ.100కే నల్లా కనెక్షన్
హైదరాబాద్ : జలమే జీవజాలం. ఈ విశ్వంలో ప్రాణులకు నీరే ప్రాణవాయువు. సకలచర జీవరాశుల ఉనికి నీటిపై ఆధారపడి ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచినీటి కోసం కోట్లు ఖర్చు చేస్తుంటాయి. పేదలకు నల్లా కనెక్షన్ కు మాత్రం ఎలాంటి చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. నామమాత్రంగా రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. దీంతో పేదలు మంచినీటి ఇక్కట్లు తీరినట్టైంది. కానీ దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న వారికే సమస్య వచ్చింది.
రూ.16 వేల నుంచి వందకు తగ్గిన కనెక్షన్
బీపీఎల్ ఎగువ ఉన్న కుటుంబాల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి రూ.వందకే నల్లా కనెక్షన్ ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నట్టు ప్రకటించింది. దీంతో నల్లా కనెక్షన్ కోసం డబ్బు చెల్లించలేని కుటుంబాలకు మేలు జరిగింది. ఇదివరకు పట్టణాల్లో దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు నల్లా కనెక్షన్ కోసం రూ.6 వేలు చెల్లించాల్సి వచ్చింది. ఒకవేళ ఇంటిలోపల నల్లా పెట్టుకోవాలంటే రూ.10 వేల 500 డిపాజిట్ తప్పనిసరి. దీంతో ఇంటిలోపల నల్లా పెట్టుకొని మంచినీరు తాగాలంటే రూ.16 వేల 500 ఖర్చు చేయాల్సి వచ్చేది. దీంతో కొందరు తమకేందుకులే నల్లా కనెక్షన్ అని మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఆ కుటుంబాలకు మేలు జరిగింది.

అమల్లోకి కొత్త స్కీం ..
నల్లా కనెక్షన్ కోసం నగదు చెల్లించని వారి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన రూ. వందకే పథకం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ గురువారం సంతకం చేశారని పేర్కొన్నాయి. ఆయా మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లో వంద రూపాయలు చెల్లించి నల్లా కనెక్షన్ తీసుకోవాలని సూచించాయి.
బీపీఎల్ కుటుంబాలకు మాత్రం రూపాయికే కనెక్షన్
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రం రూపాయికే నల్లా కనెక్షన్ పథకం కొనసాగుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బీపీఎల్ కుటుంబాల నల్లా కనెక్షన్ కేటాయింపుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో పల్లె, పట్నం అనే తేడా లేకుండా పేదలకు రూపాయికే సురక్షిత మంచినీటి పథకం యథాతథంగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications