సీబీఐకి ఆఫ్షన్లు ఇచ్చిన కవిత
హైదరాబాద్: టీఆర్ఎస్‌కు చెందిన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు తెర తీసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ సీబీఐ అధికారులు ఈ నోటీసుల్లో స్పష్టం చేసింది. మంగళవారం విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. హైదరాబాద్ లేదా ఢిల్లీల్లో విచారణ ఉంటుందని పేర్కన్నారు.

సీబీఐకి మరో లేఖ..
నోటీసులు అందిన తరువాత సీబీఐ అధికారులకు కవిత ఇవ్వాళ కూడా లేఖ రాశారు. తనకు అందజేసిన 14035/06/2022 నోటీసుల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను తనకు అందజేయాలంటూ ఆదివారం రాత్రి ఆమె సీబీఐ అధికారును కోరిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా వాటిని పంపించాలని, దీనివల్ల విచారణకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి, తగిన సమాధానాలను ఇవ్వడానికి తనకు వీలుగా ఉంటుందని చెప్పారు.

ఇవ్వాళ కూడా..
ఇవ్వాళ రెండో లేఖను రాశారు. సీబీఐ అధికారులకు ఆప్షన్లు ఇచ్చారు. 6వ తేదీన అంటే మంగళవారం విచారణకు తాను హాజరు కాలేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ సీబీఐ, ఏసీబీ విభాగాధిపతి రాఘవేంద్ర వత్సకు ఈ లేఖను పంపించారు. తాను రాసిన లేఖకు సరైన సమాధానం అందలేదని, నిర్దేశిత గడువులోగా విచారణకు హాజరుకాలేనని వివరించారు. ఎఫ్ఐఆర్ కాపీ, తనపై అందిన ఫిర్యాదులకు సంబంధించిన డాక్యుమెంట్లు వెబ్‌సైట్‌లో ఉన్నాయని సమాధానం ఇచ్చారని చెప్పారు.

నా పేరు లేదు..
సీబీఐ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్‌లో గానీ, ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వారి జాబితాలో, జులై 7వ తేదీన దాఖలైన ఫిర్యాదుల్లో.. ఎక్కడే గానీ తన పేరు కనిపించలేదని కవిత వివరించారు. ఈ పరిణామాల మధ్య తాను మంగళవారం ప్రతిపాదించిన విచారణకు హాజరు కాలేనని తేల్చి చెప్పారు. అదే రోజున కొన్ని ముందస్తు షెడ్యూల్స్ ఉండటం వల్ల వాటిల్లో పాల్గొనాల్సి ఉందని అన్నారు.

ఈ నాలుగు తేదీల్లో..
మంగళవారానికి బదులుగా- ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారణ జరపొచ్చని కవిత సీబీఐ అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. చట్టాన్ని తాను ఎంతగానో గౌరవిస్తానని, అందుకే విచారణకు సహకరిస్తానని పునరుద్ఘాటించారు. తాను ప్రతిపాదించిన ఆయా తేదీల్లో ఏ రోజైనా సరే విచారణ కోసం హైదరాబాద్‌లోని తన నివాసానికి రావొచ్చని అన్నారు. చట్టపరంగా తనకు ఉన్న అధికారాలను నిష్పక్షపాతంగా వినియోగించుకోవడానికే విచారణకు సహకరిస్తున్నానని చెప్పారు.

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా అందించిన రిమాండ్ రిపోర్ట్‌లో కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారంటూ వార్తలొచ్చిన మరుసటి రోజే సీబీఐ నుంచి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మరోవంక- టీఆర్ఎస్ నాయకులు ఈ నోటీసులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోన్నారు. ఇవి విచారణ కోసం పంపించిన నోటీసులు కావని స్పష్టం చేస్తోన్నారు. ఆమె నుంచి వివరణ తీసుకోవాలనే ఉద్దేశంలో సీబీఐ అధికారులు ఉన్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications