ఇదీ ముమ్మాటికీ కేసీఆర్ వైఫల్యమే.. సికింద్రాబాద్ ఘటనపై కేఏ పాల్
అగ్నిపథ్ ఇష్యూపై దేశం రగిలిపోతుంది. ఆందోళనకారులకు హింసాత్మక చర్యలకు దిగుతున్నారు. విపక్షాలు.. అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌తో దేశం మండిపోతోందని కేఏ పాల్ అన్నారు.

బాధాకరం..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో యువకుడు మృతి చెందడం బాధాకరం అన్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే కేసీఆర్ శాంతి భద్రతలు కాపాడరా? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు, హోంమంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. యువకులపై దాడి దురదృష్టకరం అని వాపోయారు.

అదుపులో లేవే...?
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని.. 30పైగా అత్యాచారాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోడీ ఫెయిల్యూర్ అయ్యారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం కావడానికి వారు చేసిన అవినీతే కారణం అన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత దేశం బాగుపడుతుందని అనుకుంటే, అంతకన్నా ఎక్కువగా పాడవుతోందని వాపోయారు.

రద్దు చేయండి..
సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ రద్దు చేయాలని నిరసనలు మిన్నంటాయి. రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌ను ధ్వంసం చేయడంతోపాటు మూడు రైళ్లకు నిప్పు పెట్టారు.

ఛాతీలో బుల్లెట్
పోలీసులు కాల్పులు జరపగా.. యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగింది. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే అతను మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆందోళనల్లో 11 మంది యువకులు గాయపడ్డారు. వీరందరికీ గాంధీలో చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications