టీఆర్ఎస్-జగన్‌పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూశా: తలసాని, కేసీఆర్ ఫ్రంట్‌లో ఏపీ నుంచి ఎవరంటే?
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తాము తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చెప్పారు. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది తాము కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కేవలం ప్రచారానికే పరిమితం అయిన నాయకుడు చంద్రబాబు అన్నారు. ప్రజల సొమ్ముతో ప్రచారాలు చేసుకున్నంత మాత్రాన ఎవరు కూడా వాస్తవాలు దాచలేరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలకు కారణం చంద్రబాబే అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

పవన్ కళ్యాణ్ కామెంట్స్ నేను కూడా చూశా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కామెంట్స్ తాను కూడా చూశానని తలసాని చెప్పారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణలో అడుగుపెట్టనీయనని చెప్పిన నేతలే ఇప్పుడు ఏపీలో ఆయనకు మద్దతు పలుకుతున్నారని తెరాసను ఉద్దేశించి పవన్ ఆదివారం అన్నారు. అంతకుముందు, తెరాస లాబీయింగ్ చేస్తుందని చెప్పారు. దీనిపై తలసాని స్పందించారు. ఏపీలో ఏ పార్టీకి మద్దతు ఇస్తామనే అంశంపై తాము ఇంకా ప్రకటించలేదని చెప్పారు.

చంద్రబాబు డ్రామాలు ఆడితే మద్దతివ్వాలా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు తాము కూడా మద్దతిస్తామని తలసాని చెప్పారు. అవిశ్వాసం సమయంలో చంద్రబాబు డ్రామాలు ఆడారని, అలా చేస్తే మద్దతు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తామంటే టీడీపీ ఎందుకు సహకరించలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అన్నవారిని జైల్లో పెట్టించారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ ఫ్రంట్‌లో ఏపీ నుంచి ఎవరో త్వరలో తేలుతుంది
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ఫ్రంట్‌లో ఏపీ నుంచి భాగస్వామ్యం అయ్యే పార్టీ ఏదో త్వరలో తెలుస్తుందని తలసాని అన్నారు. ఇక్కడి ప్రజానీకం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి దాసోహం అంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications