గ్రేటర్ విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు మరో శుభవార్త అందించింది. మెట్రో కాంబినేషన్ టికెట్ ధరను తగ్గించింది. ఇప్పటి వరకు మెట్రో కాంబినేషన్ టికెట్ ధర రూ. 20 ఉండగా.. దాన్ని రూ. 10కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చునని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనరా్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

గత కొద్ది రోజుల క్రితం దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలోని వివిధ కాలేజీలకు వచ్చే విద్యార్థులు టీఎస్ఆర్టీసీ జారీ చేసిన బస్‌పాస్‌లను పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. విద్యార్థుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. మెట్రో కాంబి టికెట్ ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ #TSRTC యాజమాన్యం నిర్ణయం. విద్యార్థుల సౌకర్యార్థం తగ్గించడం జరిగింది. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఇది
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) November 26, 2022
ఉపయోగించుకోవచ్చు. pic.twitter.com/C2ut6Nfkye
గ్రేటర్ పరిధిలో మరో వెయ్యికిపైగా బస్సలు
మరోవైపు, గ్రేటర్ పరిధిలో కొత్తగా వెయ్యికిపైగా సిటీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేసింది. ఎనిమిదేళ్లుగా జిల్లాల్లో తిరుగుతున్న 700 వరకు సూపర్ లగ్జరీలను నగరానికి తెచ్చి..వాటిని సిటీ బస్సులుగా మార్పులు చేయబోతున్నారు. సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య పెరుగుతుందని, దీంతో నగరానికి కొత్తగా బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
సిటీలో సరికొత్తగా 320 వరకు విద్యుత్ బస్సులను కూడా నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ బస్సులన్నీ ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకుంటున్నామని, ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తికావచ్చినట్లు చెప్పారు. రెండు నెలల్లో నూతన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కొత్తగా 1016 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీటిని ఆర్టీసీ సొంత డబ్బులతో కొనుగోలు చేస్తుందన్నారు. ఇక, నగరంలో తిరుగుతున్న కాలం చెల్లిన 700 బస్సులను తుక్కు కింద మార్చబోతున్నట్లు వివరించారు.