అంతా వారే చేశారు.. ఉత్తమ్, భట్టిపై వీహెచ్ గుర్రు..
కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ కొలిక్కి రాలేదు. ఇవాళే క్లారిటీ వస్తుందని ప్రకటన వచ్చింది. కానీ అనౌన్స్‌మెంట్ వాయిదా పడింది. దీంతో సీనియర్ నేత వీ హనుమంతరావు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితికి ఆ ఇద్దరే కారణం అని ఫైరయ్యారు. వీహెచ్ అంటేనే.. సెటైర్లు.. ఇప్పుడు ఉత్తమ్, భట్టి గురించి కామెంట్ చేయడంతో చర్చకు దారితీసింది.
తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికీ తేల్చలేదు. ఈ అంశంపై సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని మండిపడ్డారు. అందుకు కారకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క అని వీహెచ్ ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నా, ఇంతవరకు పరిస్థితిని సమీక్ష చేసే నాయకుడే లేడని విమర్శించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలే ఏకపక్షంగా పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే, పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పరిశీలకుడు వచ్చి వెళ్లాకే పీసీసీ నూతన అధ్యక్షుడిని ప్రకటించాలని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోరాదని హితవు పలికారు.
రాష్ట్రంలో ఏదైనా వివాదం ఏర్పడితే హైకమాండ్ పరిశీలకుడిని పంపడం సర్వసాధారణం అని, కర్ణాటకలో గొడవ వస్తే మధుసూదన్ మిస్త్రీని పంపారని వెల్లడించారు. కానీ తెలంగాణలో వివాదం వస్తే పార్టీ ఇన్చార్జి మాణికం ఠాగూర్ చెప్పిందే తుది నిర్ణయమా? అని వీహెచ్ ప్రశ్నించారు. తమ గోడు ఎవరి ముందు వెళ్లబోసుకోవాలో అర్థంకావడం లేదన్నారు.
వాస్తవానికి పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ పూర్తయిందని.. ప్రకటించడమే తర్వాయి అనే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. దీనిపై సీనియర్లు నోరు విప్పారు. బీసీ నేతకు అవకాశం ఇస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి.












Click it and Unblock the Notifications