Rain: ఐదు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములుమెరుపులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది.
అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(rain) కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సైక్లోనిక్ సర్కులేషన్ ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, యాదాద్రిభువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, గురువారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురిసింది.
కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వర్షాల్లోనే గణేశుడి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. అలాగే సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ, కవాడిగూడ, భోలక్‌పూర్, గాంధీనగర్, రాంనగర్, అడిక్‌మెట్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, సీతాఫల్మండి, బోయిన్పల్లి, ప్రకాశ్‌నగర్, రాణిగంజ్, ప్యారడైజ్.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైన వర్షంలో కూడా సామూహిక వినాయక విగ్రహాల ఊరేగింపు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications