TS Weather: తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం కిందిస్తాయి గాలులు పశ్చిమదిశ నుంచి రాష్ట్రంలోనికి వీస్తున్నాయని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
శుక్రవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో, శనివారం, ఆదివారం ఒకటి రెండు ప్రదేశాల్లో వచ్చే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాల్లో కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది.

కాగా, శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు కూడా కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రల్లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమమధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రంలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆగస్టు 9, 10 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రానున్న ఐదు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్ ఆగస్టు 10 వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పురాజస్థాన్ ప్రాంతంలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనూ రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం బలహీనపడిన కారణంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 7 నుంచి వర్షాలు క్రమంగా తగ్గుతాయని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, బీహార్ ఈశాన్య ప్రాంతంలో ఆగస్టు నుంచి వర్షాలు మరింతగా కురుస్తాయని వెల్లడించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు వరదల కారణంగా 12 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలోని 23 జిల్లాల యంత్రాంగాన్ని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
గత కొద్ది రోజులుగా మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో నీటిలో మునిగిపోయాయి. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ నుంచి భారీగా వరదనీరు చేరుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.












Click it and Unblock the Notifications