Liquor Shops: నిమజ్జనం వేళ మద్యం ప్రియులకు షాక్..!
పెద్ద పెద్ద పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలు మూసివేస్తుంటారు. మొన్న బోనాల సందర్భంగా హైదరాబాద్ లో వైన్ షాపులు మూసివేయించారు. ఇప్పుడు మరోసారి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం దుకాణాలు, బార్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్‌లలో సెప్టెంబర్ 17 ఉదయం 6 నుంచి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపి వేయాలని హైదరాబాద్ నగర పోలీసులు గురువారం నోటీసు జారీ చేశారు.
ఈ రోజు ఉదయం 6 నుంచి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయించినా, అందించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రజా శాంతి, ప్రశాంతత దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లతో సహా అన్ని వైన్ /కల్లు దుకాణాలు, బార్లు గణేష్ విగ్రహాల చివరి నిమజ్జనం కారణంగా మూసివేయించనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

కొద్ది రోజుల రాజా సింగ్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు ఓ లేఖ రాశారు. వినాయక నిమజ్జనం సందర్బంగా కొంత మంది మద్యం తాగి వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పారు. వారి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. మద్యం సేవించి మహిళలను వేధిస్తున్నారని.. అందుకే మద్యం తాగి నిమజ్జన వేడుకల్లో పాల్గొనవద్దని కోరారు. గత సంవత్సరం నిమజ్జనం సందర్భంగా కొంత మంది మద్యం తాగి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారని రాజా సింగ్ గుర్తు చేశారు.
కొంత మంది బుద్దిలేని వాళ్లు గణేష్ విగ్రహం వద్ద బీర్, మద్యం తాగుతూ కనిపించారని పేర్కొన్నారు. ఎవరైనా మద్యం సేవించి, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. బహిరంగంగా మద్యం తాగడం, ప్రజలపై వాటర్ ప్యాకెట్లను విసిరే సంఘటనలు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు భంగం కలిగించవద్దని కోరారు. నిమజ్జనం కోసం భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications