గోరటికి సాహిత్య అకాడమీ పురస్కారం: ‘వల్లంకి తాళం’ రచనకు అవార్డు..
తెలంగాణ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2021 సంవత్సరానికి పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీప్రకటించింది. కవిత్వ విభాగంలో 'వల్లంకి తాళం' రచనకు గోరటి వెంకన్నను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మరో కవి తగుళ్ల గోపాల్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దక్కింది. 'దండకడియం' రచనకు గాను ఈ అవార్డు వరించింది. కేంద్ర బాల సాహిత్య పురస్కారానికి దేవరాజు మహారాజు ఎంపికయ్యారు. 'నేను అంటే ఎవరు' అనే నాటక రచనకు ఈ పురస్కారం దక్కింది. మొత్తం 20 భాషల్లో పద్య, కవిత, చిన్న కథలు, నవలలు, జీవిత చరిత్రలు, విమర్శ విభాగాలకు అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది.
ప్రజాకవి, గాయకుడైన గోరటి వెంకన్న 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. జానపద పాటలతో ప్రజల్ని ఎంతో ఆకట్టుకునే వెంకన్న.. మా టీవీలో ప్రసారమైన రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. ఆ తర్వాత జానపద పాటలతో జనంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

గోరటి వెంకన్న కవి, గాయకుడు, వాగ్గేయకారుడు.. ఉద్యమ సమయంలో గజ్జె కట్టి పాట పాడి జోష్ నింపారు. ఇప్పటికీ ఆయన సాదా సీదా జీవితం గడుపుతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత.. ఆయనకు ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్సీ పదవీని ఇచ్చింది. ఇప్పుడు పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నారు.
గతేడాది తెలుగు రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగు రచయిత నిఖిలేశ్వర్ పురస్కారానికి ఎంపికయ్యారు. అసలు పేరు కుంభం యాదవరెడ్డి రాసిన అగ్నిశ్వాస రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2020 ఏడాదికి సంబంధించి మొత్తం 20 మందిని ఎంపిక చేశారు. వారిలో నిఖిలేశ్వర్ కూడా ఒకరు. ఆయన కవి, కథకుడు, అనువాదకుడు, విమర్శకుడు కూడా. ఈ సారి గోరటి వెంకన్నకు అవార్డు వరించింది.












Click it and Unblock the Notifications