హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ జారీ - వణికిపోతన్న నగరం : పెరుగుతున్న ఒమిక్రాన్..!!
భాగ్యనగరం గజగజ వణికిపోతోంది. సాధారణంగా చలికాలంలో చలి తీవ్రత ఎక్కడైనా ఉంటుంది. కానీ.. ఎక్కడా లేనివిధంగా ఈసారి హైదరాబాద్‌లో గత మూడు నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సిమ్లా వాతావారణం ప్రస్తుతం హైదరాబాద్‌లో కనిపిస్తోంది. తెలంగాణలోని పలు జిల్లా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పది సంవత్సారాలలో చూడనటువంటి ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదు
తెలంగాణలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదు అయ్యాయి. శనివారం తెల్లవారుజామున పటాన్‌చెరు ప్రాంతంలో 8.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. గతంతో డిసెంబర్ 13, 2015న హైదరాబాద్‌లో 9.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. అప్పట్లో అదే అత్యల్పం. సిటీలో ఓవర్ఆల్‌గా మినిమమ్ 12.5 డిగ్రీ సెల్సియస్‌గా నమోదు అయింది. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ. మరో నాలుగు అయిదు రోజుల వరకు ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

శీతల గాలులతో వణికిపోతున్న నగరం
మరో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని.. అలాగే గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాతావరణ శాఖ డిసెంబర్ 21 వరకు నగర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే.. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాలకు వచ్చే కొన్ని రోజుల వరకు ఆరెంజ్ వార్నింగ్‌ను వాతావారణ శాఖ జారీ చేసింది. ఇదే సమయంలో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగి పోతుంది. తాజాగా తెలంగాణ లో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని వైద్య శాఖ పేర్కొంది.

ఇదే సమయంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20 కి చేరింది. హైదరాబాద్ నగరంలోని టోలీచోకీ ప్రాంతంలో ప్రైమరీ కాంటాక్టులు ఎక్కువగా ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు, ఏపీలోనూ చలి తీవ్రత క్రమేపీ పెరుగుతూనే ఉంది. వాయువ్య, ఉత్తర, మధ్య భారతం నుంచి వీస్తున్న చలిగాలులు కోస్తాలో అనేక ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రతోపాటు కోస్తాలోని శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది.

ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలిపులి
ఈ ఏడాది శీతాకాలంలో తొలిసారిగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 13.4, కళింగపట్నంలో 13.5, నందిగామలో 14.5, విశాఖ ఎయిర్‌పోర్టులో 15.4 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో శనివారం 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జనవరి మొదటి పక్షం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం వెల్లడించింది.

అరోగ్య పరంగానూ అప్రమత్తత అవసరం
ఏజెన్సీ వ్యాప్తంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా శీతలగాలులు వీస్తున్నాయి. ఉదయం, సాయంత్రం మంచు దట్టంగా కురుస్తోంది. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల గాలుల ప్రభావం తో అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆరోగ్య పరంగానూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం సమయంలో తెలుగు రాష్ట్రాల్లో మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కరోనా నిబంధనలు సైతం ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.












Click it and Unblock the Notifications