రోహిత్ శర్మ గేమ్ ప్లాన్- ఆస్ట్రేలియాతో సిరీస్ డిసైడర్ ..!!
బుధవారం భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగనుంది. ఇది సిరీస్ డిసైడర్. గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమౌతుంది.
చెన్నై: భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్.. బుధవారం ఆరంభం కానుంది. మధ్యాహ్నం ఒకటిన్నరకు మ్యాచ్ మొదలవుతుంది. చెన్నై చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. సిరీస్ డిసైడర్ కావడం వల్ల అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. ఇందులో గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమౌతుంది. విజయం సాధించడానికి రెండు జట్లు కూడా ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేశాయి.

టెస్ట్ తరహాలో..
ఈ సిరీస్ ను నెగ్గి- తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకుంది రోహిత్ సేన. అదే దూకుడును కూడా ఈ వన్డే సిరీస్ లోనూ కొనసాగించడానికి అవసరమైన గేమ్ ప్లాన్ ను రూపొందించుకుంది. అటు ఆసీస్ కూడా అదే పట్టుదలతో ఉంది. టెస్ట్ సిరీస్ లో ఎదురైన పరాభవాన్ని వన్డే సిరీస్ తో పోగొట్టుకోవాలని భావిస్తోంది.

తలో మ్యాచ్..
ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీన్ని ఏకపక్షంగా మార్చేసింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 188 పరుగులకే కుప్పకూలిపోగా.. ఆ లక్ష్యాన్ని టీమిండియా అయిదు వికెట్ల నష్టంతో అధిగమించింది. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 117 పరుగులకే చాప చుట్టేసింది.

హోరాహోరీ..
ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్- వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లల్లోనే కొట్టి అవతల పడేసింది. చెరో మ్యాచ్ ను గెలిచిన నేపథ్యంలో- ఇక మూడో వన్డే ఆసక్తికరంగా మారింది. ఉత్కంఠతను రేపుతోంది. సిరీస్ డిసైడర్ కావడం వల్ల రెండు జట్లు కూడా హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. స్టేడియంలో పరుగుల ప్రవాహం నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.

సూర్యకు బెంచ్..
టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ను కోల్పోవడం టీమిండియాను వేధిస్తోంది. ముంబై, విశాఖ మ్యాచ్ లల్లో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఇదివరకెప్పుడూ అతను వరుసగా రెండో మ్యాచ్ లల్లో సున్నాకే పెవిలియన్ చేరిన పరిస్థిితులు లేవు. సూర్య విఫలం కావడం బ్యాటింగ్ లైనప్ కూడా ప్రభావాన్ని చూపిందా రెండు మ్యాచ్ లల్లో. డకౌట్ కావడం వల్ల మిగిలిన బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో- ఈ మ్యాచ్ లో అతణ్ని బెంచ్ కే పరిమితం చేయొచ్చు.

తుదిజట్టు అంచనాలు ఇలా..
భారత తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కేప్టెన్), రవీంద్రజడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్ ఆడొచ్చు. ఆసీస్ తుదిజట్టులో- డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కేప్టెన్), మిఛెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టొయినిస్, మిఛెల్ స్టార్క్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ ఆడొచ్చు.












Click it and Unblock the Notifications