భారతదేశంలో తాజాగా 1.72లక్షల కరోనాకేసులు, 1,008 మరణాలు; 11శాతానికి పాజిటివిటీ రేటు
భారతదేశంలో కరోనా కేసుల మధ్య ఊగిసలాట కొనసాగుతోంది. దేశంలో గత కొద్ది రోజులుగా తగ్గుతున్న కరోనా కేసులు మళ్ళీ స్వల్పంగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. బుధవారం నాడు 15 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1.72 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముందు రోజు కంటే 6.8 శాతం అదనంగా కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది.

గత 24 గంటల్లో 1,72,433 కొత్త కోవిడ్ -19 కేసులు
భారతదేశంలో గత 24 గంటల్లో 1,72,433 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.16 కోట్లకు చేరుకుంది. వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 15,33,921 గా ఉన్నాయి. కరోనా యాక్టివ్ కేసులు 3.67 శాతానికి తగ్గాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా నమోదైంది.అయితే వారపు పాజిటివిటీ రేటు 12.98 శాతంగా ఉంది. పది శాతం దిగువకు చేరిన పాజిటివిటీ రేటు మళ్లీ 11 శాతానికి సమీపించింది. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం.

గత 24 గంటల వ్యవధిలో 1,008 మరణాలు
అలాగే గత 24 గంటల వ్యవధిలో 1,008 మరణాలు సంభవించాయి. కొద్దికాలంగా కేసులు, మరణాలపై కేరళ రాష్ట్రం యొక్క ప్రభావం అత్యధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కేరళ రాష్ట్రంలో బుధవారం ఒక్క రోజే 52 వేల కేసులు రాగా, 500 మరణాలు సంభవించాయి. బుధవారం ఒక్క రోజు 2, 59,107 మంది కరోనా మహమ్మారి బారినుండి బయటపడ్డారు. రోజువారీ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదు కావడం కాస్త ఊరట కలిగిస్తున్న అంశం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 4,98,983 మంది మరణించారు.

గత 24 గంటల్లో 2,59,107 రికవరీలతో కోవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 95.14 శాతం
బుధవారం ఒక రోజు 55 లక్షల మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద, ఇప్పటివరకు 167.87 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 2,59,107 రికవరీలతో కోవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 95.14% వద్ద ఉంది. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,97,70,414కి చేరింది. అదే సమయంలో 15,69,449 పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Recommended Video

కరోనా కట్టడికి నిబంధనలు పాటించాలని చెప్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. కరోనా మహమ్మరి అంతం కాలేదని, రూపం మార్చుకుంటుందని, కొత్త కొత్త వేరియంట్ల రూపంలో పరిణామం చెందుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పదేపదే చెప్తుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ దాని సబ్ వేరియంట్లు ఆధిపత్య వేరియంట్లుగా మారుతున్నాయని చెప్తున్నారు. సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది. కరోనా కట్టడి ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్తుంది.












Click it and Unblock the Notifications