కేరళ లాటరీ సంచలనం-11 మంది డబ్బులు పోగేసి రూ.250 టికెట్- రూ.10 కోట్ల జాక్ పాట్..
కేరళలో తాజాగా ఓ అనూహ్య ఘటన జరిగింది. కేరళ ప్రభుత్వ లాటరీ టికెట్ కొనేందుకు ఓ 11 మంది మహిళలు ఏకమయ్యారు. వారంతా తాము కూడబెట్టుకున్న డబ్బుల్ని కలిపి రూ.250 లాటరీ టికెట్ కొన్నారు. లాటరీలో ఎంతో కొంత తగలకపోతుందా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఏకంగా రూ.10 కోట్ల జాక్ పాట్ తగిలింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇప్పుడు ఈ వార్త కేరళలో సంచలనం రేపుతోంది.
కేరళలోని కొజికోడ్ జిల్లాలో ఉన్న మలప్పురం మున్సిపాలిటీలో కార్మికులుగా పనిచేస్తున్న ఓ 11 మంది మహిళలు తమకు వచ్చే అరకొర వేతనాలు సరిపోక లాటరీ కొందామని నిర్ణయించుకున్నారు. లాటరీ టికెట్ ధర రూ.250. దీన్ని కొనేందుకు వారిలో ఏ ఒక్కరి దగ్గరా పూర్తి డబ్బులు లేవు. దీంతో అంతా తలో కొంత వేసుకోవాలని నిర్ణయించారు. వీరిలో 9 మంది 25 రూపాయల చొప్పున వేసుకుంటే, మరో ఇద్దరు మాత్రం రూ.12.5 రూపాయలు వేశారు. ఈ మొత్తంతో రూ.250ల కేరళ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. లాటరీ తగిలితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, వాటితో కనీస అవసరాలు తీర్చుకోవచ్చని భావించారు. కానీ వారి పంట పండింది.

తాజాగా ప్రకటించిన కేరళ లాటరీ ఫలితాలు వారిని అవాక్కయ్యేలా చేశాయి. వారు కొనుగోలు చేసిన రూ.250 టికెట్ కు ఏకంగా రూ.10 కోట్ల జాక్ పాట్ తగిలింది. దీంతో ఇది నిజమా కలా అని నమ్మలేకపోయారు. ఒకటికి రెండు సార్లు సరిచూసుకున్నారు. చివరికి తమ టికెట్ కు రూ.10 కోట్ల లాటరీ తగిలిందని తెలిసి సంతోషంలో మునిగిపోయారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఈ 11 మంది సమంగా పంచుకునేందుకు సిద్దమవుతున్నారు.
నిత్యం ఇంటింటికీ తిరుగుతూ చెత్త ఎత్తుకునే వీరంతా ఇప్పుడు ఈ లాటరీ జాక్ పాట్ తో తమ జీవితాలు మారిపోతాయని భావిస్తున్నారు. మలప్పురం మున్సిపాలిటీలో ఉన్న 57 మంది పారిశుద్ధ్య కార్మికుల్లో ఈ 11 మంది ఉన్నారు. ఇప్పుడు వీరిని చూసి మిగిలిన వారంతా అసూయ చెందుతున్నారు. తాము కూడా లాటరీ టికెట్లు కొనేందుకు సిద్దమవుతున్నారు. ప్రైజ్ గెల్చుకున్న వారిలో చాలా మంది ఇళ్లు కట్టుకునేందుకు ఈ మొత్తం ఖర్చుపెడతామంటున్నారు. మరికొందరు పిల్లల స్కూలు ఫీజులు కట్టుకుంటామని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications