13 ఏళ్ల బాలుడికి కరోనా వ్యాక్సిన్ వేశారా?: మెసేజ్ రావడంతో తండ్రి షాక్
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ 13 ఏళ్ల బాలుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ మేరకు అతడి తండ్రి ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. దీంతో ఆ తండ్రి షాకయ్యాడు. ఎందుకంటే అతడు ఏ వ్యాక్సిన్ తీసుకోలేదు. అంతేగాక, మనదేశంలో ఇప్పటి వరకు 18 లోపువారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించలేదు కూడా.
భోపాల్ తిలా జమల్పూర హౌజింగ్ కాలనీలో నివాసం ఉండే 13 ఏళ్ల వేదంత్ డాంగ్రే వ్యాక్సిన్ వేసుకున్నట్లు అతడి తండ్రి ఫోన్ కు సందేశం వచ్చింది. అయితే, ఆ సందేశంలో డింగ్రే వయస్సు 56ఏళ్లుగా చూపడం గమనార్హం. జూన్ 21న రాత్రి 7.27 గంటలకు తన కుమారుడు డాంగ్రే వ్యాక్సిన్ వేయించుకున్నాడనే మెసేజ్ వచ్చింది.
ఈ నేపథ్యంలో తాను ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారుల నుంచి సానుకూల స్పందన రాలేదని బాలుడి తండ్రి రాజత్ డాంగ్రే ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తాను లింక్ ద్వారా సెర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకుని చూడగా షాక్ కి గురైనట్లు తెలిపాడు. ప్రత్యేక అవసరాల కోసం తన కుమారుడి పెన్షన్ కోసం మున్సిపల్ కార్పొరేషన్లో దాఖలు చేసిన డాక్యుమెంట్లను ఉపయోగించారని తెలిపాడు.

కాగా, అదే రోజున కతిక్రమ్, కాళింద్ర, చందన్ అనే వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సాత్నాకు చెందిన చైనేంద్ర పాండేకు సందేశం వచ్చింది. అయితే వారెవరో తనకు తెలియదని అన్నారు పాండే. ఐదు నిమిషాల వ్యవధిలోనే మూడు సందేశాలు వచ్చాయన్నారు. నుజత్ సలీమ్ అనే 46 మహిళకు కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్లు సందేశం వచ్చింది. తాను పెన్షనర్ ని కాదని, అయినా తన పెన్షన్ డాక్యుమెంట్లను ప్రూఫ్‌గా వాడారని ఆరోపించారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, అలాంటివేమైనా తమ దృష్టికి వస్తే సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని మధ్యప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ విశ్వాస్ సరంగ్ మీడియాకు తెలిపారు. కాగా, జూన్ 21 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 17.42 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.












Click it and Unblock the Notifications