సీబీఐ, ఈడీ దుర్వినియోగాన్ని అడ్డుకోండి- సుప్రీంకోర్టుకు 14 విపక్ష పార్టీల మొర..
ఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపక్ష పార్టీల్ని కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీ టార్గెట్ చేస్తున్నాయి. విపక్ష నేతల్ని ఏదో ఒక కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో కేంద్ర దర్యాప్తుసంస్ధలు పావులు కదుపుతున్నాయని, వీటి వెనుక కేంద్రం ఉందని ఆరోపిస్తూ ఇవాళ 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
కేంద్ర దర్యాప్తు సంస్ధల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలనికోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విపక్ష పార్టీల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్-యునైటెడ్, భారత రాష్ట్ర సమితి, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ, డీఎంకే, వామపక్షాలు ఉన్నాయి. ఈ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించడంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీ కేవలం బీజేపీ ప్రత్యర్ధి పార్టీల్నిమాత్రమే వేటాడుతున్నాయని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో విపక్షాలు పేర్కొన్నాయి. అలాగే బీజేపీలో చేరిన నేతలపై కేసుల్ని మాత్రం మూలనపడేస్తున్నారని తెలిపాయి. విపక్షాలను పదే పదే టార్గెట్ చేస్తున్న ఈడీకి ఉన్నఅపరిమిత అధికారాల్నిసైతం విపక్షాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీంతో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. వచ్చేనెల 5న దీనిపై విచారణ చేపడతామని ప్రకటించింది. సీబీఐ, ఈడీ విపక్ష నేతల్ని అరెస్టు చేసే ముందు, తర్వాత అనుసరించాల్సిన మార్గదర్శకాలను జారీచేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో విపక్ష పార్టీలు కోరుతున్నాయి. ప్రస్తుతం దేశంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న తొంభై ఐదు శాతం కేసులు ప్రతిపక్ష నేతలపై ఉన్నాయని తెలిపాయి.













Click it and Unblock the Notifications