5 అంతస్తుల్లో 45 కుటుంబాలు - కుప్పకూలిన బిల్డింగ్ - శిథిలాల్లో 70 మందికిపైగా - సీఎం దిగ్భ్రాంతి
కరోనాకు తోడు భారీ వర్షాలతో అతలాకుతలమైన మహారాష్ట్రలో మరో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్ గఢ్ జిల్లాలోని మహద్ పట్టణంలో సోమవారం ఓ ఐదంతస్తుల భవంతి కుప్పకూలింది. తారీఖ్ గార్డెన్ గా పిలిచే ఆ బిల్డింగ్ లోని 45 పోర్షన్లలో పలు కుటుంబాలు జీవిస్తున్నాయి. సోమవారం సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో అది ఒక్కసారిగా కూలడంతో వందలమంది శిధిలాల్లో చిక్కుకుపోయారు.
భవంతి కూలిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 25 మందిని రెస్క్యూ చేయగా, శిధిలాల కింద మరో 70 మంది చిక్కుకుపోయి ఉండొచ్చని తెలుస్తోంది. బిల్డింగ్ లో నివసిస్తోన్న కుటుంబాల్లో చిన్న పిల్లల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.

మలద్ సిటీలో భవంతి కూలిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే భరత్ గోగావాలె, జిల్లా కలెక్టర్ నిధి చౌదరికి సీఎం ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. అవసరమైన సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు వైద్య సదుపాయంతోపాటు ఇళ్లు సురక్షితంగా బయటపడిన వాళ్లు ఉండటానికి తాత్కాలికంగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
కాగా, మలద్ ప్రమాద ఘటనకు ఇంకా కారణాలు తెలియాల్సిఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటుండటం గమనార్హం. గత నెల ముంబైలో భారీ వర్షాల ధాటికి ఓ భవంతి కూలిన ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మలద్ సిటీ ఘటనలో ప్రాణనష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

మహారాష్ట్రలో భవంతి కుప్పకూలడం, అందులో పలువురు చిక్కుకుపోవడం విచారకరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వీలైనంత వేగంగా సహాయక చర్యలు కొనసాగించాలని ఎన్టీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కు సూచించానని అమిత్ షా ట్విటర్ ద్వారా తెలిపారు.












Click it and Unblock the Notifications