ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..3 రాష్ట్రాల్లో 19 జిల్లాలపై ఫొని ప్రభావం..
Recommended Video
ఫొని వణికిస్తోంది. అతి తీవ్ర తుఫానుగా మారిన ఫణి ఒడిశా వైపు శరవేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం ఒడిశా తీరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గత ఆరు గంటలుగా గంటకు 5కిలోమీటర్ల వేగంతో ఫొని తుఫాను కదులుతోందని, శుక్రవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని గోపాల్‌పూర్, ఛాంద్‌బాలీ వద్ద 200కి.మీ వేగంతో తీరం దాటుతుందని అధికారులు చెబుతున్నారు. ఒడిశా, ఏపీ, బెంగాల్‌లోని పంతొమ్మిది జిల్లాలపై ఫొని ప్రభావం అధికంగా ఉంటుందని అంటున్నారు.

ఉత్తర కోస్తాపై ప్రభావం
ఫొని తుఫాను ప్రభావం ఉత్తర కోస్తాపై ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాను తన ప్రతాపం చూపనుంది. గురువారం విశాఖ తీరానికి 130 నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనున్న తుఫాను శుక్రవారం నాటికి శ్రీకాకుళంపై పంజా విసరనుంది. ఆ జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచి ఒడిశావైపు పయనించనుండటంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ స్థాయిలో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

భీకర వర్షం, పెనుగాలులు
శుక్రవారం తీరాన్ని తాకనున్న ఫొని ప్రభావంతో ఒడిశా తీరంతో పాటు శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియనున్నాయి. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్ష పాతం నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు.

19 జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు
ఫొను తుఫాను ప్రభావం ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశాలోని కెంద్రపారా, భద్రక్, జాజ్‌పూర్, బాలాసోర్ జిల్లాలు, బెంగాల్‌లోని ఈస్ట్, వెస్ట్ మిడ్నాపూర్, దక్షిణ, ఉత్తరంలోని 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, కోల్కకతాలపై ఫొని ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది.

సముద్రం అల్లకల్లోలం
తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర, ఒడిశా, బెంగాల్ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం కొన్ని మీటర్ల మేర ముందుకు వచ్చింది. ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లో సముద్రం ఉవ్వెత్తున ఎగసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. 4వ తేదీ వరకు సముద్రం అత్యంత ప్రమాదకరంగా ఉండే అవకాశమున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications