మహిళా రెజ్లర్లకు మద్దతుగా 1983 కపిల్ దేవ్ టీమ్-ఇప్పటికే రైతుల ఆందోళనలు..
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు బాధితులుగా మారిన మహిళా రెజ్లర్లు ఢిల్లీలో గత నెల రోజులుగా చేస్తున్న ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. మహిళా రెజ్లర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా బీజేపీ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్ పై చర్యలకు పోలీసులు వెనకాడుతుండటంతో పరిస్ధితి నానాటికీ దిగజారుతోంది. ఈ నేపథ్యంలో రైతులు, క్రీడాకారులు రెజ్లర్లకు అండగా నిలుస్తున్నారు.
ఢిల్లీలో నిరసనలు చేస్తున్న మహిళా రెజ్లర్లకు ఇవాళ 1983లో క్రికెట్ ప్రపంచకప్ గెల్చుకున్న కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు సంఘీభావం ప్రకటించింది. రెజ్లర్లకు తాము అండగా ఉంటామని ప్రకటించింది. వారు ఎలాంటి దుందుడుకు చర్యలకు మాత్రం పాల్పడవద్దని కోరింది. వారు కష్టపడి సంపాదించిన పతకాలను పవిత్ర గంగా నదిలోకి విసిరేయడం వంటి తీవ్రమైన చర్యలు సరికాదని క్రికెట్ టీమ్ కోరింది.

మా ఛాంపియన్ రెజ్లర్లు ఆవేదన చెందుతున్న దృశ్యాలను చూసి చాలా బాధపడ్డామని, కలవరపడ్డామని కపిల్ టీమ్ తెలిపింది. వారు కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని భావించడాన్ని చూసి చాలా ఆందోళన చెందుతున్నామని 1983 క్రికెట్ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ పతకాల వెనుక సంవత్సరాల తరబడి కృషి, త్యాగం, సంకల్పం ఉన్నాయని తెలిపింది. అవి వారి స్వంతం మాత్రమే కాదని, దేశం యొక్క గర్వం, సంతోషమని వెల్లడించింది. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారిని కోరింది.
రెజ్లర్ల మనోవేదనలను త్వరగా విని పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు కపిల్ నేతృత్వంలోని క్రికెట్ టీమ్ సభ్యులైన సునీల్ గవాస్కర్, మొహిందర్ అమర్ నాథ్ తెలిపారు. చట్టప్రకారం విచారణ జరిగేలా సహకరించాలని వారిని కోరారు.అనుమతి లేకుండా కొత్త పార్లమెంటు భవనం వైపు వెళ్లి నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత 1983 క్రికెట్ టీమ్ ఈ ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications