పంజాబ్ ఎన్నికల బరిలో రైతులు- కూటమిగా ఏర్పడ్డ 22 సంఘాలు-సాగు చట్టాల మైలేజే ఆధారం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాడి చివరికి అదే కేంద్రం మెడలు వంచి చట్టాలు వెనక్కి తీసుకునేలా చేయడంలో విజయం సాధించిన రైతు సంఘాలు ఇప్పుడు పంజాబ్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. వ్యవసాయ చట్టాలపై పోరుతో వచ్చి మైలేజ్ ను సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగాలని ఇవాళ నిర్ణయించాయి.
పంజాబ్ కు చెందిన 22 రైతు సంఘాలు వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇవాళ ప్రకటించాయి. ఇవాళ చండీఘడ్ లో సమావేశమైన రైతు సంఘాల ప్రతినిధులు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని నిర్ణయించాయి. గత ఏడాది వ్యవసాయ చట్టాలపై నిరసనలు చేపట్టిన పంజాబ్ కు చెందిన 32 రైతు సంఘాల్లో ఈ 22 సంఘాలు కూడా ఉన్నాయి. సంయుక్త్ సమాజ్ మోర్చా పేరుతో ఓ రాజకీయ కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తామని వీరి ప్రతినిధి హర్మీత్ సింగ్ కడియాన్ ప్రకటించారు.

గతేడాది వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ద్వారా రైతులు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. పంజాబ్ నుంచి మొదలైన ఈ పోరాటం ఆ తర్వాత ఐదు రాష్ట్రాలకు పాకింది. దీంతో రైతు సంఘాల నేతలు కూడా ఆయా రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందారు. తమ పోరాటం ద్వారా వచ్చిన మైలేజ్ ను ఇతర రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకు వారు సిద్ధంగా లేరు. అందుకే ఇప్పుడు పంజాబ్ ఎన్నికల్లో తామే స్వయంగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు.
అందుకే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు కోరేందుకు సిద్ధమవుతున్నారు. విపక్షాల పోరాటంతో వ్యవసాయచట్టాలు కేంద్రం వెనక్కి తీసుకోలేదని, ఏడాదికి పైగా తాము చేసిన పోరాటంతోనే ఇది సాధ్యమైనందని చెప్పేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పంజాబ్ లో అధికార కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా రైతుల కూటమిపై దృష్టిసారించాయి.












Click it and Unblock the Notifications