బీహార్‌లో కల్తీ మద్యానికి 27 మంది బలి.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం!
బిహార్ రాష్ట్రంలో కల్తీ మద్యానికి 27 మంది బలైపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తుండడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన పలువురు కల్తీ మద్యం తాగి అనారోగ్యం పాలైనట్లు ఎస్పీ శివన్ అమితేశ్ కుమార్ వెల్లడించారు. అయితే, ఆస్పత్రిలో చేరినవారిలో బుధవారం నాటికి ఆరుగురు మృతి చెందగా.. ఆ సంఖ్య గురువారం 27 చేరింది. అంతేకాదు, ఇంకా పలువురి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ వైఫల్యమే అంటూ..
ఈ కల్తీ మద్యం ఘటనపై రాష్ట్రం ప్రభుత్వం స్పందించింది. ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చాప్రా సూపరింటెండెంట్ ఆశిష్ కుమార్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేయడంతోపాటు మరో ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. మస్రాక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నుంచి వివరణ కోరామని, భగవాన్‌పుర్ ఎస్హెచ్ఓతోపాటు ఎఎస్‌ఐపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కల్తీ మద్యం ఘటనపై ప్రతిపక్ష ఆర్‌జేడీ నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై ద్వజమెత్తింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించింది. రాష్ట్రంలో నిషేధం ఉండగా కల్తీ మద్యం ఎలా అందుబాటులోకి వచ్చిందని ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ ప్రశ్నించారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, బీహార్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకు రాష్ట్ర ప్రభుత్వ కొమ్ముకాస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ అండతోనే మద్యపాన నిషేధ చట్టం ఉల్లంఘన జరుగుతోందని విమర్శించారు.

మద్య నిషేధం అమల్లోనే ఉంది..
అయితే, ప్రతిపక్షం చేసిన ఆరోపణలుపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉందనే విషయం మర్చిపోవద్దని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ గుర్తు చేశారు. కొందరు లిక్కర్ మాఫియా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కల్తీ మద్యం విషయంలో సీఎం నితీశ్ కుమార్ చాలా కఠినంగా వ్యవహరించనున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications