2జీ స్పెక్ట్రమ్‌ కేసు: తీర్పుపై షబ్బీర్‌ హర్షం, గర్వపడకండి అన్న జైట్లీ, సవాలు చేస్తానన్న స్వామి

Posted By:
Subscribe to Oneindia Telugu
  2G Spectrum Case : 2జీ స్పెక్ట్రమ్‌ కేసు : ఒకపక్క హర్షం, మరో పక్క విమర్శలు !

  హైదరాబాద్‌: దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పుపై పలువురు ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అన్నాహజారే, పి.చిదంబరం, కపిల్ సిబాల్ తదితరులు స్పందించారు.

  2జీ కుంభకోణం కేసులో టెలికాంశాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా నిందితులుగా ఉన్న 17 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పును ప్రకటించిన సంగతి తెలిసిందే.

  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా స్పందించారు. షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం చేయగా, అరుణ్ జైట్లీ తీర్పును చూసి గర్వపడకండని వ్యాఖ్యానించారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు.

  తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన షబ్బీర్ అలీ...

  తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన షబ్బీర్ అలీ...

  2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితం 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని యూపీఏ ప్రభుత్వంపై ఆరోపణలు రావడంతో అప్పటి ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం వల్ల దేశానికి రు.1.75 లక్షల కోట్లు నష్టం జరిగిందని అప్పట్లో బీజేపీ ఇతర పార్టీల నేతలు ఆరోపించారని గుర్తుచేశారు. ఈ కేసులో డీఎంకే నేతలు రాజా, కణిమొళిలకు కోర్టు క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై షబ్బీర్ అలీ సంతోషం వ్యక్తంచేశారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంపై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని షబ్బీర్ కోరారు.

  తీర్పును చూసి గర్వపడకండి: జైట్లీ

  తీర్పును చూసి గర్వపడకండి: జైట్లీ

  2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. దీనిపై కాంగ్రెస్‌ సంతోషం వ్యక్తం చేయడాన్ని జైట్లీ తప్పుబట్టారు. 2జీ కుంభకోణంలో వచ్చిన తీర్పును చూసి గర్వపడకండి అని ఆయన హితవు పలికారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులను 2012లో సుప్రీంకోర్టు రద్దు చేసినప్పుడే కాంగ్రెస్‌ పార్టీ విఫల సిద్ధాంతాలు రుజువయ్యాయంటూ జైట్లీ విమర్శించారు.

  తీర్పును సవాలు చేస్తా: సుబ్రహ్మణ్య స్వామి

  తీర్పును సవాలు చేస్తా: సుబ్రహ్మణ్య స్వామి

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు బాగోలేదని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. పాటియాలా ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. గురువారం ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ తీర్పును మాజీ ఏజీ ముకుల్‌ రోహత్గి స్వాగతించడాన్ని కూడా స్వామి తప్పుబట్టారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని కూడా స్వామి చెప్పారు.

  జయలలిత కేసులోనూ తొలుత ఇలాగే...

  జయలలిత కేసులోనూ తొలుత ఇలాగే...

  దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు సమయంలోను కర్ణాటక న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చిందని, కానీ ఆ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చిందని సుబ్రహ్మణ్య స్వామి గుర్తు చేశారు. అదేవిధంగా 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కూడా తీర్పును సవాలు చేస్తే ఉన్నత న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

  హైకోర్టులో అప్పీలు చేయనున్న సీబీఐ

  హైకోర్టులో అప్పీలు చేయనున్న సీబీఐ

  2జీ కుంభకోణం కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా నిందితులుగా ఉన్న 17 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. సరైన సాక్ష్యాధారాలు లేనందునే వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుపై అటు కాంగ్రెస్‌, ఇటు డీఎంకే హర్షం వ్యక్తం చేశాయి. అయితే సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ex-Minister, Congress Leader Shabbir Ali, Union Minister for Finance Arun Jaitley, BJP Leader Subramanian Swamy expressed their views on the Final Verdict in 2G Spectrum Case given by Special CBI Court on Thursday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి