మావోయిస్టుల కాల్పులు: ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి, పలువురికి గాయాలు

న్యూఢిల్లీ: మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 19వ బెటాలియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన రోడ్ ఓపెనింగ్ పార్టీ (ROP)పై మంగళవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని నువాపాడా వద్ద దాడి జరిగింది.
మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని బోడెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహజ్‌పానీ గ్రామం వద్ద సీఆర్పీఎఫ్ దళాలే లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. మరణించిన జవాన్లను ఏఎస్ఐ శిశుపాల్ సింగ్, ఏఎస్ఐ శివ్ లాల్, కానిస్టేబుల్ ధర్మేంద్ర కుమార్ సింగ్‌గా గుర్తించారు.
రోడ్డు ఓపెనింగ్ కోసం జవాన్లు కొత్త క్యాంప్‌కి వెళ్లే సమయంలో వర్షం పడటంతో ముగ్గురు జవాన్లు టార్పాలిన్ కింద తలదాచుకున్నారు. అయితే, మావోయిస్టుల గుంపు.. జవాన్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారని సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి.
మరణించిన జవాన్ల నుంచి మూడు ఏకే-47 రైఫిళ్లను కూడా నక్సల్స్ లాక్కొని పారిపోయారని ఐజీ పోలీస్ (ఆపరేషన్స్) అమితాబ్ ఠాకూర్ తెలిపారు.
కాగా, నువాపాడ ఎస్పీ, సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఎస్ఓజీ, సీఆర్పీఎఫ్ మరిన్ని బృందాలు ఆపరేషన్‌లో ఉంచబడ్డాయి.
అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒడిశా పోలీస్ డీజీపీ సునీల్ బన్సల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మావోయిస్టుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో ఆపరేషన్లు కొనసాగుతాయని, అమరవీరుల అత్యున్నత త్యాగం వృథా కాదన్నారు.












Click it and Unblock the Notifications