ఐఎఎస్ స్టడీ సర్కిల్‌లో దారుణం: ముగ్గురు విద్యార్థులు జలసమాధి
Rau's IAS coaching centre: దేశ రాజధానిలో దిగ్భ్రాంతకర ఘటన చోటు చేసుకుంది. ఐఎఎస్ కావాలని కలలు గన్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. స్టడీ సర్కిల్ భవనం బేస్‌మెంట్‌లో నీటిలో చిక్కుకుని జల సమాధి అయ్యారు. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
ఈ ఉదంతంపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల మృతిపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మంత్రి ఆతిషి ఓ ప్రకటన విడుదల చేశారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

ఢిల్లీలోని రావుస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలోని ఓల్డ్ రాజేంద్రనగర్ బాడా బజార్‌లో ఉంటుందీ కోచింగ్ సెంటర్. ఐఎఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇక్కడ చదువుకుంటుంటారు.
నాలుగు అంతస్తుల భవనం ఇది. ఈ భవనం బేస్‌మెంట్‌లో లైబ్రరీ సహా కొందరు విద్యార్థులకు వసతి సౌకర్యం ఉంది. రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఈ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌లో వరదనీరు పోటెత్తింది. ఆ సమయంలో పలువురు విద్యార్థులు లైబ్రరీలో ఉన్నారు.
ఒక్కసారిగా నీరు బేస్‌మెంట్‌లోనికి ప్రవహించడంతో బయటికి వెళ్లే వీలు లేకుండాపోయింది. కొందరు విద్యార్థులు ప్రాణాలతో బయటపడగలిగారు. ముగ్గురు అక్కడే చిక్కుకుపోయారు. జలసమాధి అయ్యారు. వారిని తానియా సోని, శ్రేయా యాదవ్, నెవిన్ దాల్విన్‌గా గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. పంపుల ద్వారా వరదనీటిని తోడేశారు. తాళ్ల సహాయంతో అప్పటికప్పుడు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తొలుత రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ తెల్లవారుజామున మరో మృతదేహాన్ని వెలికి తీశారు.
ఈ ఘటనతో ఢిల్లీ మొత్తం ఉలిక్కిపడింది. విద్యార్థులందరూ రావుస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్ భవనం వద్దకు చేరుకున్నారు. ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. స్టడీ సర్కిల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాత్రంతా వారి ఆందోళన కొనసాగింది. ఈ తెల్లవారు జామున ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ ద్వారకా పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఎం హర్షవర్ధన్ తెలిపారు. యాజమాన్యంపై కేసు నమోదైనట్లు చెప్పారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆతిషి తెలిపారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications