దూసుకెళ్తున్న నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు.. ఆ ప్రాంతాలవారికి పండుగే!
భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు రైలు ప్రయాణికులకు 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించి శుభవార్త చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
నాలుగు వందే భారత్ రైళ్ళను ప్రారంభించిన ప్రధాని మోదీ
బెనారస్ ఖజురహో, లక్నో సహరాన్పూర్, ఫిరోజ్పూర్ ఢిల్లీ, ఎర్నాకులం బెంగళూరు మార్గాలలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వందే భారత్ రైళ్లు ప్రజలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి అని, ఎక్కువ సౌకర్యాలను అందిస్తాయని ప్రధాని మోడీ వెల్లడించారు.

రైల్వే పురోగతిపై మాట్లాడిన మోదీ
వందే భారత్, నమో భారత్, అమృత భారత్ వంటి రైళ్లు కొత్తతరం భారతీయ రైల్వేలకు పునాది వేస్తున్నాయని ఆయన అన్నారు. వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధిలో మౌలిక సదుపాయాలు ఒక ప్రధాన అంశంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అభివృద్ధిలో భారత్ దూసుకుపోతుందన్న మోదీ
భారతదేశం కూడా అభివృద్ధి మార్గంలో వేగంగా కదులుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి సదుపాయాలు అంటే కేవలం రహదారులు పెద్ద వంతెనలు మాత్రమే కాదని రైల్వే కూడా అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వ్యవస్థలు ఎక్కడైనా అభివృద్ధి చేస్తే, అది ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు.
ప్రత్యక్ష కనెక్టివిటీని పెంచుతున్న వందే భారత్
ప్రస్తుతం బెనారస్ ఖజురహో వందే భారత్ రైలు ప్రత్యక్ష కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుందని, ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్ల తో పోలిస్తే రెండు గంటల 20:40 నిమిషాలు ఆదా అవుతుందని ఇప్పటికే రైల్వే వెల్లడించింది. ఒక బెనారస్ ఖజురహో రైలు మాత్రమే కాదు ఈరోజు ప్రారంభించబడిన మిగతా రైళ్లు కూడా ప్రయాణ సమయాన్ని తగ్గించి మంచి మౌలిక వసతులను కల్పిస్తాయని భారతీయ రైల్వే వెల్లడించింది.
ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్న వందే భారత్ రైళ్ళు
లక్నో సహరాన్పూర్ వందే భారత్ రైలు దాదాపు 7.45 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేసి, గంట సమయాన్ని ఆదా చేస్తుందని పేర్కొంది. ఫిరోజ్పూర్ ఢిల్లీ వందే భారత్ రైలు ఆరు గంటల నలభై నిముషాలలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని, ఇది కూడా ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందని వెల్లడించింది.
రైళ్ళను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ఎర్నాకులం బెంగళూరు వందే భారత్ ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు పైగా తగ్గిస్తుందని, ఇది ఎనిమిది గంటల నలభై నిమిషాలలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని రైల్వే వెల్లడించింది. మొత్తంగా ఈ నాలుగు రైళ్ళను ప్రారంభించి ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడంతో, ప్రయాణాలు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications