మహా సంక్షోభం: 42కి చేరిన షిండే ఎమ్మెల్యేల సంఖ్య.. ఉద్దవ్‌కు శరద్ పవార్ సపోర్ట్
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల నుంచి పట్టును శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే కోల్పోయారు. ఏక్‌నాథ్ షిండేకు మద్దతు పెరుగుతుంది. అంతేకాదు గువహటిలో హోటల్‌లో తొలిసారి 42 మంది ఎమ్మెల్యేలు కనిపించారు. వారంతా శివసేన జిందాబాద్.. బాలాసాహెబ్ థాకరే కీ జై అని నినాదాలు చేశారు.

ఫడ్నవీస్ సీఎం అంటూ
శివసేన ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు కూడా షిండేకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఆయన కింగ్ మేకర్ అయ్యారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఔరంగబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. తిరిగి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని కనిపించాయి. దీంతో కలకలం నెలకొంది. మహారాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభం కొనసాగుతోన్న వేళ.. పోస్టర్లు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడే కాదు ఎన్నికల తర్వాత కూడా అజిత్ పవార్‌తో చేరి ఫడ్నవీస్ సీఎం పదవీ చేపట్టారు. మద్దతు లేకపోవడంతో తర్వాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

వి సపోర్ట్ థాకరే
మరోవైపు శివసేన ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సీపీ కూడా పరిస్థితిని నిశీతంగా గమనిస్తోంది. పార్టీ నేతలతో అధినేత శరద్ పవార్ సమావేశం అయ్యారు. ఈ ఆపద సమయంలో ఉద్దవ్ థాకరే వెంట ఉంటామని తెలిపారు. ఇప్పుడు తమ అధికారం కోల్పోతే సిద్దంగా ఉండాలని.. తర్వాత జరిగే రాజకీయ పోరాటానికి రెడీగా ఉండాలని కోరారు.

42కు చేరిన ఎమ్మెల్యేల సంఖ్య
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. శివసేన నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగబాటు ఎగరవేశారు. తొలుత 21 మంది ఎమ్మెల్యేలను తీసుకొని గుజరాత్ వెళ్లారు. ఇప్పుడు ఆ సంఖ్య 42కి చేరింది. ఏక్‌నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అదీ ఇప్పుడు బయటపడింది.
పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావించారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార మహాకూటమి, విపక్ష బీజేపీ చెరో 5 సీట్లు గెలుచుకున్న గంటల వ్యవధిలో ఈ పరిణామం జరిగింది. బీజేపీ పోటీ చేసిన 5 చోట్ల విజయం సాధించింది.