మావోలతో ఎదురు కాల్పులు: ఆర్కె తప్పించుకున్నాడా?
విశాఖపట్నం: ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల్లోని మల్కాన్‌గిరి జిల్లా పాపరమెట్ల వద్ద భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఎవరూ చనిపోలేదని ఆంధ్ర పోలీసులు ప్రకటించారు. సోమవారం ఉదయం ఎదురుకాల్పుల సంఘటన చోటు చేసుకుంది. మావోయిస్టుల కోసం ఆదివారం రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఒడిషాకుకు చెందిన స్పెషల్ ఆపరేష్ గ్రూప్, బిఎస్ఎఫ్, సిఆర్‌పిఎఫ్ బలగాలు గాలింపు చర్యలు జరుపుతున్నాయి.
ఆంధ్రా ఓడిశా సరిహద్దుల్లో జరిగిన కూంబింగ్‌లో మావోయిస్టులు ఎవరూ చనిపోలేదని ఏపీ పోలీసులు ప్రకటించారు. కూంబింగ్ సమయంలో మావోయిస్టులు పోలీసులకు ఎదురు పడ్డారు. వారి వద్ద నుంచి గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు.
ఒడిషాలోని మల్కాన్‌గిరికి 150 కిలోమీటర్ల దూరంలో గల గ్రామంలో తిరుగుబాటుదార్లకు, భద్రతాబలగాలకు మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయని మల్కాన్‌గిరి జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ఎం. మహాపాత్ర చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిషా సరిహద్దుల్లోని పనసపట్టు వద్ద ఎదురుకాల్పులు జరిగినట్లు ఆయన తెలిపారు.

భద్రతా బలగాల సంయుక్త గాలింపు చర్యల సందర్భంగా మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయని జీ మీడియా రాసింది. మావోయిస్టులు కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఐసి వైయస్ జెత్వా చెప్పారు.
ఇదిలావుంటే, మావోయిస్టులు ఆదివారం రాత్రి మల్కాన్‌గిరి జిల్లాలోని పాడియా పోలీసు స్టేషన్ పరిధిలోని కొరాయిగుడాలో ఇద్దరు వ్యక్తులను చంపేశారు. మృతులను జగ కబాసి, సోతి నాగలుగా గుర్తించారు. మావోయిస్టులు రాత్రి పూట గ్రామానికి వచ్చి వారిద్దరిని తీసుకుని వెళ్లి ఆ తర్వాత ప్రజాకోర్టు నిర్వహించి కొట్టారని, దాంతో వారిద్దరు మరణించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications