Parliament Intruders: నలుగురు పార్లమెంట్ చొరబాటుదారులకు వారం కస్టడీ-ఢిల్లీ పోలీసు విచారణ..
నిన్న పార్లమెంట్లో చొరబడి కలర్ స్మోక్ విడుదల చేసిన నలుగురిని పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు లోక్ సభ లోకి చొరబడి కలర్ స్మోక్ ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొరబడి నినాదాలతో హల్ చల్ చేశారు. వీరిని వెంటనే అరెస్టు చేసి ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఇవాళ వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు వీరికి వారం రోజుల పాటు పోలీసు కస్టడీ విధించింది.
పార్లమెంటులోకి చొరబడిన నలుగురిలో సాగర్ శర్మ, మనోరంజన్, నీలం దేవి, అమోల్ షిండే ఉన్నారు. ఈ నలుగురికీ కోర్టు ఇవాళ వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. దీంతో రేపటి నుంచి పోలీసులు వీరిని విచారించబోతున్నారు. ఇదే ఘటనలో వీరికి సహకరించిన మరో ఇద్దరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు ఇంకా పరారీలో ఉన్నారు. దీంతో వీరిని కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిన్న పోలీసులు అరెస్టు చేసిన నలుగురిలో లక్నోకు చెందిన సాగర్ శర్మ, మైసూర్‌కు చెందిన డి మనోరంజన్‌లు స్మోక్‌బాంబులను తీసుకెళ్లి పార్లమెంట్‌లో వదిలేశారు. దీంతో ఎంపీలు దట్టమైన పసుపు పొగతో కాసేపు భయాందోళనకు గురయ్యారు. ఎంపీలు, పార్లమెంట్‌ల వాచ్ అండ్ వార్డ్ సిబ్బంది ఈ ఇద్దరినీ వెంటనే పట్టుకున్నారు.సందర్శకుల పాస్‌లు దొరకని నీలం దేవి, అమోల్ షిండే స్మోక్‌బాంబులు పట్టుకుని పార్లమెంటు వెలుపల నినాదాలు చేశారు.
ఈ నలుగురిపై కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపాతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. వీరికి ఆశ్రయం ఇచ్చిన విశాల్ శర్మ, అతని భార్యను గురుగ్రామ్ లో అరెస్టు చేశారు. కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా ఇంకా పరారీలో ఉన్నాడు. దీంతో అతని కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications