అనాథ శరణాలయం బాలికలే టార్గెట్..7మంది రేప్, కేరళలో దురాగతం
ఇటీవలే ఒక విద్యార్థిని ఆ షాపులోంచి బయటకు రావడం చూసిన అనాథ శరణాలయం సెక్యూరిటీ విషయంపై ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కల్‌పెట్టా: కేరళలోని ఓ ముస్లిం అనాథ శరణాలయ విద్యార్థుల పట్ల అక్కడి కొంతమంది యువత సాగిస్తున్న దురాగతం తాజాగా వెలుగుచూసింది. వారిని పలురకాలుగా మభ్యపెట్టి ఆకర్షిస్తున్న యువకులు సంవత్సర కాలంగా వారిపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నట్లుగా తెలుస్తోంది.
అనాథ శరణాలయ అడ్మినిస్ట్రేటర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. అనాథ శరణాలయం పక్కన్నే ఒక షాపు ఉండగా.. నిత్యం కొంతమంది యువకులు అక్కడికి వచ్చిపోతుంటారు. గత కొన్నాళ్లుగా శరణాలయం నుంచి స్కూలుకు వెళ్లే విద్యార్థినిలను ఆకర్షించడమే వీరు పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో స్వీట్లు, పలు రకాల వస్తువులు ఆశచూపి విద్యార్థినులను షాపులోకి రప్పించుకునేవారు.

ఆపై వారికి బలవంతంగా పోర్న్ సినిమాలు చూపిస్తూ అత్యాచారానికి పాల్పడేవారు. విషయం బయటకు పొక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యువకులు వారిని తీవ్రంగా హెచ్చరించేవారు. వారి బెదిరింపులకు భయపడి ఇన్నాళ్లు ఎవరూ నోరు మెదపలేదు.
ఇటీవలే ఒక విద్యార్థిని ఆ షాపులోంచి బయటకు రావడం చూసిన అనాథ శరణాలయం సెక్యూరిటీ విషయంపై ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శరణాలయంలోని చాలామంది విద్యార్థినులను లొంగదీసుకుని ఆ యువకులు చాలాకాలంగా ఈ నిర్వాకానికి పాల్పడుతున్నారని సెక్యూరిటీ గుర్తించాడు.
విషయం శరణాలయం అడ్మినిస్ట్రేషన్ కు చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురిని అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. యువకుల చేతిలో అత్యాచారానికి గురైన బాలికలను 7,8,9, తరగతుల విద్యార్థినులుగా గుర్తించారు.
ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థినులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మొత్తం 30మంది విద్యార్థినుల దాకా అత్యాచార వేధింపులకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు చేసిన ఆ ఏడుగురిని పోలీసులు మెడికల్ పరీక్ష కోసం పంపించారు. సోమవారం రాత్రి కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications